Odisha BRS : బీఆర్ఎస్ లోకి ఒడిశా నేతలు.. తెలంగాణ తరహా మార్పు దేశమంతటా తెస్తామన్న కేసీఆర్...
27 January 2023, 20:13 IST
- Odisha BRS :ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో ఒడిశాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు కారెక్కారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ తరహా మార్పు దేశమంతటా తెస్తామని అన్నారు. దళితబందు, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, తాగునీరు దేశం అంతా ఇస్తామని పునరుద్ఘాటించారు.
బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా నేతలు
Odisha BRS : దేశంలో జరిగే ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలిచి... ప్రజలు ఓడిపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి... ఎన్నికల్లో ప్రజలు గెలిచేలా చేసేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో... గిరిధర్ గమాంగ్ కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. కేసీఆర్. గిరిధర్ గమాంగ్ సతీమణి హేమా గమాంగ్.. కుమారుడు శిశిర్ కమాంగ్ కూడా బీఆర్ఎస్ లో చేరారు. వీరితోపాటు ఒడిశాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజా సంఘాల నాయకులు.. గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నేతలకు స్వాగతం పలికిన కేసీఆర్.. గిరిధర్ గమాంగ్ నేతృత్వంలో ఒడిశాలో పార్టీ వేగంగా విస్తరిస్తుందని అన్నారు. దేశంలో స్థితిగతులు మార్చి... సమగ్రాభివద్ధి సాధించేందుకే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. దళితబందు, రైతుబందు, 24 గంటల ఉచిత కరెంట్, త్రాగునీరు దేశం అంతా ఇస్తామని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. దేశంలో ఇంకా అనేక సమస్యలు అలాగే ఉన్నాయని.. కేసీఆర్ అన్నారు. అమెరికా, చైనా కన్నా ఎక్కువ వనరులు ఉన్నా.. అభివృద్ధిలో ఆయా దేశాలకన్నా వెనకబడ్డామని చెప్పారు. తాగు, సాగు నీరు.. విద్యుత్ అందించలేని దుస్థితి పోవాలని ఆకాంక్షించారు. దేశంలో ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారాయన్న కేసీఆర్... రైతులు, పేదల పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలేంటని ప్రశ్నించారు. దేశంలోని కొంత మంది నాయకులకి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారిందని... ఏమైనా చేసి ఎలక్షన్లలో గెలుపొందాలని చూస్తున్నారని అన్నారు. ఇందుకోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
పంటల సాగుకి అపారమైన నేలలు, నీటి వనరులు ఉన్నా... వాటిని వినియోగించుకోవడంపై పాలకులు దృష్టి సారించలేదని కేసీఆర్ విమర్శించారు. ఒడిశాలోని మహానది నీటిలో కేవలం 25 శాతమే వినియోగిస్తున్నారని.. మిగతా నీరంతా సముద్రంలోకి వెళ్లిపోతుందని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో జరుగుతోందన్నారు. నీరు, విద్యుత్ కోసం రైతులు ఉద్యమాలు చేసే పరిస్థితులు తెచ్చారన్న కేసీఆర్... కొంతమంది వారి పోరాటాలను కూడా అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులు శాసించే స్థితిలో ఉండాలన్న సంకల్పంతోనే... తాము అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ... బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లో ప్రవేశించామని వివరించారు. రైతులు హలం దున్నడమే కాదు.. కలంతో రాయడమూ నేర్చుకోవాలన్న కేసీఆర్... రైతులే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రైతుల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడితే... నీళ్లు, కరెంట్ ఎలా రావో అప్పుడు చూస్తామని వ్యాఖ్యానించారు.
8 ఏళ్ల క్రితం తెలంగాణలో నీళ్లు, కరెంట్ లేవని.. తాము కష్టపడి సమస్యలు పరిష్కరించుకున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరిగినప్పుడు... ఒడిశా, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎందుకు మార్పు రాదని ప్రశ్నించారు. దేశంలోనే మహారాష్ట్ర రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తరువాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. ఒడిశాలో పెన్షన్ 5 వందలు ఇస్తున్నారని... అదే తెలంగాణలో 2 వేలు ఇస్తున్నామని వివరించారు. సోషలైజేషన్ అనేది నష్టం... ప్రైవేటైజేషన్ అనేది లాభం అనే నినాదంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని.... ఎన్ని రోజులు అదాని, అంబానిలకు ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రైవేటైజేషన్ ను పారదోలాలన్న కేసీఆర్..... ఒడిశా నుంచి వేల చేతుల బలం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అనుకుంటున్న లక్ష్యం కచ్చితంగా చేరుకుంటాం అనే నమ్మకం ఉందని చెప్పారు.