Warangal Crime: వరంగల్ నగరంలో ‘నార్త్’ దొంగలు! అలర్ట్ గా ఉండాలని పోలీసుల ప్రచారం
23 August 2024, 6:15 IST
- Warangal Crime: వరంగల్ కమిషనరేట్ లో అంతర్రాష్ట్ర దొంగలు చొరబడ్డారు. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో వరంగల్ మహా నగరంలోని తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై దొంగతనాలు చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి.
అపార్ట్‌మెంట్‌లో వాహనాలను ఎత్తుకుపోతున్న దొంగలు
Warangal Crime: వరంగల్ కమిషనరేట్ లో అంతర్రాష్ట్ర దొంగలు చొరబడ్డారు. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో వరంగల్ మహా నగరంలోని తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై దొంగతనాలు చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతుండగా, గురువారం తెల్లవారుజామున ఓ అపార్ట్మెంట్ లో దుండగులు బైక్ ను ఎత్తుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందుగా అపార్ట్మెంట్ లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. అసలు విషయం బయట పడింది. సీసీ ఫుటేజీలో ఐదుగురు దుండగులు, మాస్కులు, ముసుగు కప్పుకొని గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ లోకి అయి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్క్ చేసి ఉన్న టీఎస్ 03 ఈడబ్ల్యూ 0437 నెంబర్ కలిగిన హోండా సీబీ షైన్ బైక్ ను ఎత్తుకెళ్లారు. అంతేగాకుండా అపార్ట్మెంట్ లోపలికి ప్రవేశించి, వివిధ ఫ్లోర్ లు కూడా తిరిగారు. నగరంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతుండగా.. విచారణ ప్రారంభించిన పోలీస్ ఆఫీసర్లు దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.
యూపీ గ్యాంగ్ పనేనా..?
సీసీ ఫుటేజీలో కనిపించిన నిందితుల కదలికలను బట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వారంతా నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అపార్ట్మెంట్ సీసీ ఫుటేజీని సేకరించి, దాని ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
ఉత్తర భారతదేశానికి చెందిన దుండగులు వరంగల్ నగరంలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నారని, వారి ఫొటో లు , వీడియాలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యూపీ గ్యాంగ్ ల గురించి ఆరా తీస్తున్నారు.
నార్త్ ఇండియా నుంచి అంతర్రాష్ట్ర దొంగల ముఠా వరంగల్ నగరంలోకి ప్రవేశించిందని, ఎవరైనా తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఇంటి పక్కన ఉండేవాళ్లకో లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ లోనే సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. వరంగల్ నగరంలోని మట్వాడా, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ, హసన్ పర్తి, ఎల్కతుర్తి ఇలా వివిధ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ అధికారులు సోషల్ మీడియా వేదికగా జనాలను అలర్ట్ చేసేలా ఆయా సందేశాలను షేర్ చేస్తున్నారు.
గస్తీ లేకనే దొంగతనాలు...!
వరంగల్ నగరంలో పోలీసుల గస్తీ సరిగా లేకనే అంతర్రాష్ట్ర ముఠాల ఆగడాలు సాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించేలా ప్రతి రోజు పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీస్ అధికారులు పొలిటికల్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారని, కనీసం గస్తీ నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని వాపోతున్నారు.
ఇదిలాఉంటే హనుమకొండలోని అపార్ట్మెంట్ లోకి చొరబడిన ఐదుగురు దుండగులు తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3.10 నిమిషాల వరకు.. అంటే దాదాపు 40 నిమిషాల వరకు అదే అపార్ట్మెంట్ లో చోరీల కోసం తిరిగినా అటు వైపు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే వరంగల్ నగరంలోని సుబేదారి, హనుమకొండ, కేయూ, మట్వాడా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి దొంగతనాలు జరగగా.. పోలీసుల గస్తీ లోపం దుండగులకు కలిసి వస్తోందని జనాలు మండిపడుతున్నారు. ఇకనైనా వరంగల్ నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు దొంగతనాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)