500 Gas Cylinder : దీపం లబ్దిదారులకా? ఉజ్వల యోజన వాళ్లకా? రూ.500 సిలిండర్ గైడ్ లైన్స్ పై ప్రజల్లో ఆసక్తి!
23 December 2023, 15:20 IST
- 500 Gas Cylinder : ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసింది. అయితే రూ.500 గ్యాస్ సిలిండర్ హామీపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్యాస్ సిలిండర్
500 Gas Cylinder : ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. అయితే తర్వాత ప్రకటించబోయే పథకం గురించి ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మహాలక్ష్మిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణంపై ఊహించిన స్పందన వస్తోంది. ఈ స్కీమ్ అమలుతో ఆరంభంలోనే కాంగ్రెస్ సర్కారు ప్రజల నుంచి మార్కులు కొట్టేసింది.
రెండ్రోజుల్లో రెండు హామీలు అమలు
రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తరువాత అమలు చేసే పథకంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తరువాత ఏ స్కీం ప్రకటిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. అయితే మెజార్టీ ప్రజలు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీపై ప్రకటించిన హామీ అమలుచేయాలని కోరుతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో రెండు హామీలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటి పేద మహిళకు నెలకు రూ.2,500 కాగా, అలాగే రూ.500 గ్యాస్ సిలిండర్ అందించడం. ఈ రెండు పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత మైలేజ్ వచ్చే అవకాశముంది.
కాంగ్రెస్ ప్రభుత్వాని మద్దతు పెరగాలంటే?
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరం. ఇప్పటికే ఫలితాలు వెలువడిన రెండు రోజులకే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజులకే కూలిపోతుందని, వచ్చేది తమ ప్రభుత్వమని వ్యాఖ్యలు చేశారు. పైగా కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని, ఎంఐఎం, బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటే ఐదేండ్ల పాటు ఢోకా ఉండదని విశ్లేషకులు అంచనా. మెజార్టీ ప్రజలు మెచ్చే పథకాలు ముందుగా అమలు చేస్తే ప్రభుత్వానికి మరింత మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే రూ.500 సిలిండర్‌పై ఏ చిన్న వార్త వచ్చిన జనాలు క్యూ కడుతున్నారు. ఇటీవల కైవేసీ అప్డేట్ కు ఏజెన్సీల ముందు జనాలు క్యూలు కట్టడం ఇందుకు నిదర్శనం. చమురు కంపెనీలు తమ నిబంధనల్లో భాగంగా అప్డేట్ కోరితే ఏకంగా రూ.500 సిలిండర్ కోసం కేవైసీ చేసుకోవాలనే పుకారు వ్యాపించింది.
గైడ్‌లైన్స్ కోసం వెయిటింగ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 సబ్సిడీ సిలిండర్‌పై మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అందరికీ వర్తిస్తుందా లేక కొందరికా అని తెలియాల్సి ఉంది. పీఎంయువై స్కీంలోని లబ్దిదారులకా లేక దీపం స్కీంలోకి వాళ్లకు కూడా వర్తిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వ గణంకాల ప్రకారం.. తెలంగాణలో 11,52,806 కనెక్షన్లు ఉన్నాయి. ఇక దీపం పథకంలోనూ లక్షల్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 72,488 కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వం ప్రకటించిన రూ.500 సిలిండర్ పథకం కోసం ఎదురుచూస్తున్నారు.