Prof Kodandaram : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పెన్షనర్లకు సమన్యాయం దక్కాలి- ప్రొ.కోదండరాం
19 December 2023, 22:35 IST
- Prof Kodandaram : 30 నుంచి 40 ఏళ్ల ప్రభుత్వానికి వెట్టిచాకిరి చేస్తు్న్న ఉద్యోగులకు చివరికి నిరాశే ఎదురవుతోందని ప్రొ.కోదండరాం అన్నారు. పదవీ విరమణ అనంతరం తమపై ఆధారపడొద్దని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయన్నారు.
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ సమావేశం
Prof Kodandaram : జాతీయ పెన్షన్ దారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 నుంచి 40 ఏళ్లుగా ఒక సంస్థకు పనిసేవ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వేరే పని చేయలేని పరిస్థితి ఉంటుందని, చాలీచాలని జీతాలతో ఇప్పుడున్న కాలంలో ఖర్చులు పెరిగి పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలడంలేదన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పదవీ విరమణ అనంతరం తమపై ఆధార పడొద్దని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. చివరికి ఉద్యోగులకు నిరాశనే దక్కుతుందన్నారు. కొత్త పెన్షన్ స్కీం కింద ప్రభుత్వాలు, విద్య, వైద్యం రిటైర్డ్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.
ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యాలను కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు సహాయం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని కోదండరాం ఆరోపించారు. దేశంలో వనరులు ఇప్పించడానికి, కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇప్పించడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. మా పెన్షనర్ల సంక్షేమం పట్టించుకోకపోతే మీ సంక్షేమం మాకెందుకు అని అడగవలసిన అవసరం ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులపై ఉందన్నారు. ఇప్పటికైనా పెన్షన్ దారులు మనుషులుగా బతుకుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ... పెన్షనర్ల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నగదు రహిత వైద్యం అని చెప్పి ఆచరణలో కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డులను అనుమతించడం లేదని అన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పేరుకుపోయిన కోట్లాది రూపాయలు పెన్షనర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.