Madiga Jodo Yatra : కుల గణన చేయకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర- పిడమర్తి రవి
22 February 2024, 21:53 IST
- Madiga Jodo Yatra : కులగణనతోనే ఎస్సీ వర్గీకరణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మాదిగ సంఘాల రాష్ట్ర ఛైర్మన్ డా.పిడమర్తి రవి అన్నారు. కుల గణన చేయకుండా కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.
మాదిగల జోడో యాత్ర
Madiga Jodo Yatra : కులగణనతోనే ఎస్సీ వర్గీకరణ, అన్ని కులాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, మాదిగ సంఘాల రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల జోడో యాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో మాదిగల జోడోయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ.."కుల గణన చేయకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలు అలాగే ఉండిపోయాయని అన్నారు. కులగణన చేస్తేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలు అల్లర్లను మతవిద్వేషాలకు తావునీయకుండా బీజేపీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి తీరాలని పిలుపునిచ్చారు. కేవలం మాదిగలకు మాయమాటలు చెప్పి మాదిగల ఓట్ల ద్వారానే ఉత్తర తెలంగాణలో బీజేపీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందని, మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కమిటీలతో కాలయాపన చేస్తుందని అన్నారు.
మాదిగల జోడో యాత్ర
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ క్రైస్తవ వ్యతిరేకి పార్టీ కేవలం బీజేపీనే అని పిడమర్తి రవి విమర్శించారు. బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారం కోల్పోతుందని ఆ పార్టీ మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండదన్నారు. మాదిగలు బీజేపీకి ఓటు వేయొద్దని, జిల్లాలో మాదిగల జోడోయాత్ర విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రేపు పెద్దపల్లి, కరీంనగర్ లో మాదిగల జోడో యాత్ర ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరికుంటా శ్రీనివాస్, మాల్యాల గోవర్ధన్, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుదాల బాబురావు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టింగ్ : ఎమ్.భాస్కర్, నిజామాబాద్