Nizamabad Crime : డిచ్ పల్లి పీఎస్ నుంచి దొంగ పరారీ, రంగంలోకి జాగిలాలు
09 January 2024, 21:51 IST
- Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి చోరీ కేసులో అరెస్టైన నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు జాగిలాల సాయంతో గాలిస్తున్నారు.
దొంగ కోసం పోలీస్ జాగిలాలతో గాలింపు
Nizamabad Crime : పోలీస్ కస్టడీలో ఉన్న ఓ దొంగ పారిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. జక్రాన్ పల్లి మండలం సమీపంలోని అర్గుల్ జాతీయ రహదారి 44పై గొలుసు చోరీ జరిగింది. ఈ ఘటనలో హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ఉంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నిందితుడు బాత్రూంకి వెళ్తానని చెప్పగా స్టేషన్ లోని సిబ్బంది అతన్ని లాకప్ నుంచి బయటకు తీశారు. ఈ సమయంలో నిందితుడు పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం జాగిలాలతో గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎసీపీ కిరణ్ కుమార్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది.