CI Arrest: హిట్ అండ్ రన్ కేసులో నిజామాబాద్ సిఐ అరెస్ట్…
29 January 2024, 7:05 IST
- CI Arrest: హిట్ అండ్ రన్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించిన కేసులో నిజామాబాద్ సిఐను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ సిఐ ప్రేమ్ కుమార్
CI Arrest: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిని కేసు నుంచి తప్పించిన కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిజామాబాద్ సిఐను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వా త కేసు నుంచి తప్పించేందుకు పైరవీ చేసినందుకు నిజామాబాద్ సిఐను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో సంచలనం రేకెత్తించిన హిట్ అండ్ రన్ కేసులో మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో నిజామాబాద్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహె ఉన్నారు. నిందితుడు సాహిల్‌ను తప్పించడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు.
తాజా అరెస్టులతో కలిపి ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన ప్రధాన నిందితుడు సాహిల్‌తో పాటు అతని తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
బోధన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ఇటీవలే నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరాల్సిన ప్రేమ్‌కుమార్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ బిహెండబ్ల్యూ కారు అతివేగంగా నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడ్ని తప్పించేశారు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ ప్రమాదానికి కారణమని పంజాగుట్టలో కేసు నమోదు చేయించారు. నిజామాబాద్ సిఐ ఫోన్‌లో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు తో మాట్లాడి కేసు తారుమారు చేయడానికి సహకరించినట్లు దర్యాప్తులో బయటపడింది.
స్టేషన్ నుంచి సాహిల్‌ను విడిపించిన దృశ్యాలు సిసిటీవీలో నమోదయ్యాయి. నిందితుల సెల్‌ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా షకీల్, ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి.కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్‌కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదానికి కారణమైన సాహిల్‌ను ముంబయికి పంపించడంలో షకీల్ అనుచరుడైన అబ్దుల్‌వాహె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని వదిలేసిన ఇన్‌స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగానే అసలు నిందితుడి స్థానంలో మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.