Jogulamba Gadwal Tourism: గద్వాల సంస్థానాధీశులు కట్టిన నిజాం కొండను చూశారా…
06 February 2024, 7:30 IST
- Jogulamba Gadwal Tourism: కృష్ణ నదిలో గద్వాల సంస్థానాధీశులు కట్టిన నిజాం కొండ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
నిజాం కొండ వద్ద నదీతీరంలో కనిపించే విగ్రహాలు
Jogulamba Gadwal Tourism: జోగులాంబ గద్వాల జిల్లా లోని ఇటిక్యాల మండలంలోని గ్రామం బీచుపల్లి గ్రామం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామం 7వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. 12 ఏళ్లకు ఓ సారి కృష్ణానది పుష్కరాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
ఇక్కడ ప్రాచీనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండుటచే లక్షలాది భక్తులు పుష్కరస్నానం చేయడానికి తరలివస్తుంటారు. ఈ ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది . కృష్ణవేణి దేవాలయం, ఇతర దేవాలయాలు, ఉద్యానవనం మున్నగునవి ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎంతో ఆహ్లదాన్నిస్తాయి.
ఇక్కడ కృష్ణానది మధ్యలో ఉన్న దీవి మీద ఉన్న కొండను ‘నిజాంకొండ’ అని పిలుస్తారు. ఈ కొండమీద గద్వాల సంస్థానాధీశులు 17వ శతాబ్దంలో ఈ కోటను కట్టించారని ఇక్కడ దొరికిన చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి.
రాజా 3వ సోమనాద్రి (సోమభూపాలుడు) రెండవ భార్య రాణి లింగమ్మ కోట నిర్మాణాన్ని ప్రారంభిస్తే, సోమనాద్రి పెద్దకొడుకు (1739-) హయాంలో కోట కట్టడం పూర్తయినట్టు చరిత్ర చెబుతోంది.
గద్వాల, వనపర్తి సంస్థానాలకు సరిహద్దు బీచుపల్లి. సైనిక అవసరాలకోసం ఈ కోటను నిర్మించారు. ఇపుడు ఈ కోట శిథిలమైన కోటగోడలతో, బురుజులతో, అక్కడక్కడ కూలిన భవనాల అవశేషాలతో కనపడుతున్నది.
నది వ్యాపారానికి నిలయం…
ఒకప్పుడు ఈ కోట రక్షణస్థావరంగానే కాదు, నదిమీద జరిగే వ్యాపారాలకు కేంద్రంగా కూడా వుండేది. ప్రస్తుతం నిజాంకొండ మీదికి పర్యాటకులు వెళ్ళడానికి మెట్ల నిర్మాణం జరిగింది. మెట్లమార్గంలో పైకి వెళుతున్నపుడే దారిలో ఆంజనేయస్వామి దేవాలయం వుంది.
నదిమీదుగా 7వ జాతీయరహదారి వెళ్ళుతున్నది. నదిలో ఈ దీవి, కోట, అందమైన నదీతీరం, పచ్చదనం సందర్శకులను ఆకర్షిస్తున్నది. సమీపంలో జూరాలప్రాజెక్టు, విద్యుదుత్పత్తికేంద్రం, గద్వాలకోటవంటి దర్శనీయ ప్రదేశాలున్నాయి.
బీచుపల్లి వద్ద నదిలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎన్నోశిల్పాలను తెచ్చి జలనిమజ్జనం చేసిపోతుంటారు. పూజారుల సలహాలమీద భగ్నమైన విగ్రహాలను పూజించొద్దని, గుడిలో ఉంచితే అరిష్టమని వాటిని ఎంతోదూరం నుంచి తెచ్చి నదిలో వేయడం అలవాటుగా మారిపోయింది.
వాటిని ఆయా గ్రామాల్లో పల్లెవనాల్లోనో, గ్రామపంచాయతి ఆవరణలోనో, గుడి ప్రాకారం లోపలనో పెడితే స్థానిక గ్రామచరిత్రకు ఆధారాలుగా వుండేవి. శిల్పాలశైలినిబట్టి అవి ఏ కాలానివో చెప్పగలవారుంటే, ఆయా మతాల విగ్రహాలు, అప్పటి సంస్కృతి, పాలకుల గురించి తెలుస్తుంది.
చరిత్రను కాపాడుకోవాలి....
ఇలాంటి విగ్రాలని సేకరించి వాటిని కాపాడుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హర గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ ఉన్న శాసనాలు, విగ్రాలను సేకరించి వాటి ఆధారంగా ఇక్కడి చరిత్రను కూడా లిఖితబద్దం చేయాలిసిన అవసరమున్నదని, అయన అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతమంతా తిరిగి, అక్కడ లభించిన చరిత్ర ఆనవాళ్లను ఫోటోలు తీసి, వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్న వేమా రెడ్డి హనుమాన్‌ని.. హర గోపాల్ అభినందించారు.
(ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)