తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Ktr : గులాబీ పార్టీ ప్రధాని మోదీకి గులాంగిరి పార్టీ కాదు- మంత్రి కేటీఆర్

Minister KTR : గులాబీ పార్టీ ప్రధాని మోదీకి గులాంగిరి పార్టీ కాదు- మంత్రి కేటీఆర్

HT Telugu Desk HT Telugu

04 October 2023, 22:02 IST

google News
    • Minister KTR : తాను ముఖ్యమంత్రి కావాలంటే ఎవరి సపోర్టు అవసరంలేదని ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. గులాబీ పార్టీ ఎవరికి గులాంగిరి చేయదన్నారు.
మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

Minister KTR : ప్రధాని మోదీ గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నిర్మల్ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు, అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. ప్రధాని చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని, తాను ముఖ్యమంత్రి కావాలంటే ఎవరి సపోర్ట్ అవసరం లేదని తెలిపారు. మా పార్టీలో ముఖ్యమంత్రి చేసుకోవడానికి మోదీ మద్దతు ఎన్వోసీ తమకు అవసరం లేదని అన్నారు. తమ పార్టీ గులాబీ పార్టీ అని ఎవరికి గులాంగిరి పార్టీ కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీపై పెరుగుతున్న మక్కువ చూసి, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ పార్టీ కాలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏ రంగంలో చూసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికలలో చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలేనని, జన్ ధన్ ఖాతా ద్వారా డబ్బులు జమ చేస్తానని చెప్పి నేటి వరకు ఒక ఖాతాలో ఒక రూపాయి జమ చేయలేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా వేలాది మంది ఆర్థిక సాయం అందించిందని, రుణమాఫీ చేసిందన్నారు.

వ్యవసాయ రంగంలో ముందున్నాం

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో రైతులు నీళ్లు లేక, కరెంటు లేక దిక్కుతోచని స్థితిలో ఉండేవారని, గత ప్రభుత్వం రైతులు కాలవలకు మోటర్లు పెట్టి నీళ్లు తీసుకుంటుంటే దాడులు చేసి వైర్లు కట్ చేసే వారిని, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సాగునీరు, తాగునీరు ఉచిత విద్యుత్ ఇస్తూ ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ స్థానిక రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ వ్యవసాయం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, వరి పంట ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయిందన్నారు. సహజ సంపద కలిగిన అడవుల జిల్లాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు రైతుల అలవాటు పడుతున్నారని కొనియాడారు. జిల్లాలో డ్రాగన్ ప్రూట్స్ సైతం పండించడం ఆనందమే అని చెప్పారు.

రూ.1167 కోట్ల అభివృద్ధి పనులు

బుధవారం ఉదయం నిర్మల్ జిల్లా గుండంపల్లి చేరుకున్న మంత్రి కేటీఆర్ అక్కడ కాలేశ్వరం ప్రాజెక్టు కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన పంప్ హౌస్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగునీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. సోమ మండలం గాంధీనగర్ నుంచి మాదాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి ఆర్ అండ్ బీ పనులను ప్రారంభించారు. ఇదే మండలంలో పాత పోచంపాడు గ్రామంలో 40 ఎకరాలు విస్తీర్ణంలో చేపడుతున్న 250 కోట్ల వ్యయంతో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయంలో రెండు కోట్ల నిధులతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ కు శంకుస్థాపన చేశారు.

రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్

తదుపరి వ్యాసం