NIMS Doctors Record : రూ. 15 లక్షల సర్జరీ.. ఉచితంగా చేశారు..
25 December 2022, 23:32 IST
- NIMS Doctors Record : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోన్న నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు.. మరో ఘనత సాధించారు. ఒకే రోజు 4 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ప్రైవేటులో రూ. 15 లక్షల ఖర్చయ్యే సర్జరీలను ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేసి.. బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
నిమ్స్ వైద్యుల అరుదైన ఘనత
NIMS Doctors Record : ప్రైవేటు ఆసుపత్రిలో దాదాపు రూ. 15 లక్షల ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను.. అక్కడి వైద్యులు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేశారు. ఆ ఆపరేషన్లు కూడా ఒకే రోజు.. నలుగురికి విజయవంతంగా నిర్వహించారు. 24 గంటల్లో నాలుగు శస్త్ర చికిత్సలు పూర్తి చేసి… వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తోన్న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఈ అరుదైన రికార్డుకి వేదికైంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక రోజు వ్యవధిలో 4 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ జరగడం ఇదే తొలిసారి. గతంలో ఇదే నిమ్స్ లో.. గతంలో ఒకే రోజు ఇద్దరికి మూత్ర పిండాల మార్పిడి చేశారు. గత రికార్డుని అధిగమించి.. అద్భుతమైన సేవలు అందించిన నిమ్స్ వైద్యులకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబ్ నగర్ కు చెందిన ఖలీద్ అహ్మద్ ... కరీంనగర్ కు చెందిన సాత్విక్... హైదరాబాద్ కు చెందిన సంతోష్, వెంకట లక్ష్మీలకు.. కిడ్నీలు పాడయ్యాయి. వీరంతా డయాలసీస్ తో నెట్టుకొస్తున్నారు. కిడ్నీ మార్పిడి కోసం నిమ్స్ లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఒకే రోజు ఈ నలుగురికి మూత్ర పిండాల మార్పిడి చేయాలని నిర్ణయించుకున్న వైద్యులు... మొదటి ముగ్గురికి కేడావర్ పద్ధతిలో శస్త్రచికిత్సను విజయంతంగా పూర్తి చేశారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన మూత్ర పిండాలను కేడావర్ అంటారు. ఇక.. వెంకట లక్ష్మీకి ఆమె భర్త కిడ్నీ దానం చేశారు. దీంతో.. ఆమెకు లైవ్ పద్ధతిలో ట్రాన్స్ ప్లాంట్ చేశారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఈ శస్త్రచికిత్సలు.. నిమ్స్ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో జరిగాయి. డాక్టర్లు విద్యాసాగర్, రాంచంద్రయ్య, రఘువీర్, చరణ్ కుమార్, ధీరజ్, వినయ్, సునీల్, అరుణ్, జానకీ, విష్ణు, పవన్, హర్ష, సూరజ్, అనంత్, శంకర్ ల బృందం... అనస్థీషియా వైద్యులు డాక్టర్ ఇందిర, గీత, పద్మజ, నిర్మల ఈ సర్జరీల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి.. దక్షిణాది రాష్ట్రాల్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ప్రభుత్వ ఆసుపత్రులలో కిడ్నీ సంబంధిత చికిత్సలకు కేరాఫ్ గా మారింది. ఇక్కడ చికిత్స కోసం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోగులు వస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. నిమ్స్ లో 2013 నుంచి 2022 నవంబర్ వరకు 329 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు.