Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం... సరికొత్త సైబర్ నేరం…
23 December 2024, 5:51 IST
- Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని బ్యాంకుకు వెళ్ళితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమన్నారు బ్యాంక్ అధికారులు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఖాతాలోని సుమారు పది లక్షలు మాయమయ్యాయి. ఈ ఘరానా మోసం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.
కరీంనగర్‌లో సైబర్ క్రైమ్, ఏటీఎం పోయిందని ఫిర్యాదు చేస్తే డబ్బులు పోయాయి
Cyber Crime: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండ గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ సైబర్ నేరగాళ్ళ ఉచ్చుకు చిక్కి పది లక్షలు పోగొట్టుకున్నాడు. బార్బర్ పని చేసుకుంటూ జీవించే శ్రీనివాస్ కు గంగాధర మండలం కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో ఖాతా ఉంది. స్వయం ఉపాధి తో జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలో పది లక్షల వరకు పొదుపు చేశారు.
శ్రీనివాస్ ఏటీఎం కార్డు పోవడంతో కొత్త కార్డు కోసం బ్యాంకులో సంప్రదించారు. బ్యాంకు సిబ్బంది బ్యాంకులో గోడకి అతికించిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయమని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బ్యాంకు వాళ్ళు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయగా, మరుసటి రోజు రెండు గంటల లోపు మీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇక తమ సమస్య పరిష్కారం అవుతుందని భావించిన శ్రీనివాస్.
టోల్ ఫ్రీ నుంచి కాల్ తో ఖాతాలో డబ్బులు మాయం...
ఏటీఎం కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్ కు టోల్ ఫ్రీ నుంచి ఫోన్ వచ్చింది. ఏటీఎం కోసం కాల్ చేశారు కదా అంటూ మీకు ఓటీపీ నెంబర్ వచ్చింది చెప్పండని అడిగారు. అలా రెండు సార్లు ఓటిపి నెంబర్ రావడంతో టోల్ ఫ్రీ పేరుతో వచ్చిన కాల్ వాళ్ళకు చెప్పాడు. ఇంకే ముంది, శ్రీనివాస్ ఖాతా నుంచి 9 లక్షల 97 వేల 300 రూపాయలు మాయమయ్యాయి. ఈ సంగతి అప్పుడే గమనించని శ్రీనివాస్, కొద్ది రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్ళి ఖాతాలోని డబ్బుల గురించి వాకాబు చేయగా 997300 రూపాయలు లేవు. బ్యాంకు అధికారులను నిలదుస్తే సరైన సమాధానం రాలేదు. దీంతో మోసపోయిన శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు.
బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే తాను మోసపోయానని శ్రీనివాస్ అంటున్నారు. ఎటిఎం కార్డు పోయిందని బ్యాంకు లో సంప్రదించినప్పుడు సరిగా స్పందిస్తే మోసపోయేవాడిని కాదంటున్నారు. గోడకు అతికించిన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఖాతాదారులు మోస పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలుసులను సంప్రదించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో పిర్యాదు చేశారు. సైబర్ నేరం క్రింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)