Bank theft case: నగదు మాయంపై క్యాషియర్ సెల్ఫీ వీడియో.. ఏం చెప్పాడంటే
13 May 2022, 15:08 IST
- వనస్థలిపురంలోని బ్యాంకు చోరీ కేసు మరో టర్న్ తీసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంకు క్యాషియర్ ప్రవీణ్.. సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
వనస్థలిపురం బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్
వనస్థలిపురం బ్యాంక్ చోరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నిన్నటి వరకూ క్రికెట్ బెట్టింగ్ వ్యవహరమే చోరీకి కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంకులోని నగదు తీసుకెళ్లలేదని స్పష్టం చేశాడు. బ్యాంకు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తాను చోరీ చేసినట్లు ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
వీడియోలో ఏం చెప్పాడంటే...
‘అత్యవసర పని ఉందని చెప్పి మధ్యాహ్నం 4 గంటల సమయంలో బ్యాంక్ నుంచి బయటికి వెళ్లాను. వెళ్లేటప్పుడు బ్యాగ్ కానీ, నగదు కానీ తీసుకెళ్లలేదు. ఇలాంటి వార్తలు రావటం చూసి షాక్ అయ్యాను. రెండు మూడు నెలల నుంచే బ్యాంక్‌లోని నగదు లెక్కల్లో తేడాలొస్తున్నాయని మేనేజర్ కు ఫిర్యాదు చేశాను. ఇన్ని రోజులుగా సర్దుకొచ్చినప్పటికీ.. తేడా మరింత పెరగటంతో తట్టుకోలేక వెళ్లిపోయాను.బ్యాంకు మేనేజర్, సిబ్బంది కలిసి సేఫ్ లాకర్‌లో నగదు తీసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బ్యాంకులో నుంచి వెళ్లిన సమయంలో సీసీ కెమెరాలతో పాటు సేఫ్ లాకర్‌లో బీరువాకు ఉండే సీసీ కెమెరాలను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది. అయితే నగదు భద్రపరిచే బీరువా వద్ద సీసీ కెమెరా పని చేయటం లేదు" అని వీడియోలో ప్రస్తావించాడు.
అసలేం జరిగిందంటే
బ్యాంకులోని నగదుతో క్యాషియర్ పరారైన ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. వనస్థలిపురం సాహెబ్‌నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం బ్యాంకులోని రూ. 22.53 లక్షలతో పరారయ్యాడు. ఈ విషయంపై బ్యాంకు అధికారులు.. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ తల్లిని పోలీసులు ప్రశ్నించారు. క్రికెట్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోయాయని తల్లి చరవాణికి ప్రవీణ్ సందేశం పెట్టి... ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై సెల్ఫీ వీడియో ద్వారా ప్రవీణ్ వివరణ ఇచ్చాడు. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలతో ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు.
టాపిక్