తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila Remand: పోలీసులకు చెంపదెబ్బలు.. చంచల్‌గూడ జైలుకు షర్మిల

YS Sharmila Remand: పోలీసులకు చెంపదెబ్బలు.. చంచల్‌గూడ జైలుకు షర్మిల

HT Telugu Desk HT Telugu

25 April 2023, 7:34 IST

google News
    • YS Sharmila Remand: ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, దాడి చేసిన వైఎస్‌.షర్మిలకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. 
మహిళ కానిస్టేబుల్ చెంప పగులగొట్టిన షర్మిల
మహిళ కానిస్టేబుల్ చెంప పగులగొట్టిన షర్మిల

మహిళ కానిస్టేబుల్ చెంప పగులగొట్టిన షర్మిల

YS Sharmila Remand: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంతో షర్మిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ఆమెను హాజరు పరిచారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం షర్మిలకు 14రోజుల రిమాండ్ విధించింది.

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం సోమవారం వివాదానికి కారణమైంది. మహిళా కానిస్టేబుల్‌ చెంపపై కొట్టడంతో పాటు, ఎస్సైని నెట్టుకుంటూ ముందుక వెళ్లారు. పోలీసులు నిలువరిస్తున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్‌ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్‌ కాలిపైకి టైరు ఎక్కింది. వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులపైకి కారును పోనివ్వాలంటూ డ్రైవర్‌ను రెచ్చగొట్టారు.

తీవ్ర ఉద్రిక్తత నడుమ బంజారాహిల్స్‌ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెను కలవడానికి ఠాణాకు వచ్చిన తల్లి విజయమ్మ కూడా మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. షర్మిల 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రిమాండ్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు.ఇరుపక్షాల వాదనల అనంతరం సోమవారం రాత్రి 9.30 గంటలకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో షర్మిలను నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు తరలించారు.

టిఎస్‌పిఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని షర్మిల భావించారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారును అడ్డుకోవడంతో కాలి నడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తనను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ఏమి అధికారం ఉందని ప్రశ్నించారు. తాను ధర్నాకు, నిరసనకు వెళ్లడం లేదని, వినతి పత్రం ఇచ్చి వస్తానని పోలీసులకు వివరించారు. కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఎస్సై రవీందర్‌పై షర్మిల చేయి చేసుకుని పక్కకు నెట్టేశారు. ఈ సమయంలో కానిస్టేబుల్ కాలిమీద నుంచి కారు వెళ్లడంతో అతను గాయపడ్డాడు. పోలీసులతో షర్మిల వ్యవహరించిన తీరుపై ఐపీసీ 332, 353చ 407, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిలకు రిమాండ్‌ విధించడంతో ఆమెను నేరుగా చంచల్ గూడ తరలించారు. షర్మిల తరపున దాఖలైన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేశారు.

పోలీసులపై చేయిచేసుకున్నందుకు షర్మిలతో పాటు, ఆమె డ్రైవరు బాలు, జాకబ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 332, 353, 509, 427, 109, 337, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ తెలిపారు. విజయమ్మపై కూడా కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

తదుపరి వ్యాసం