Loksabha MP Tickets : పార్లమెంటు ఎన్నికలకు వారసత్వ రాజకీయాలు- ఎంపీ టికెట్ల కోసం నేతల కుటుంబ సభ్యులు పోటీ
10 February 2024, 16:10 IST
- Loksabha MP Tickets : పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ముందు వరుసలో ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు వారసత్వ రాజకీయాలు
Loksabha MP Tickets : పార్లమెంటు ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. అదే తరుణంలో ఆయా రాజకీయ పార్టీలో హడావిడి కూడా మొదలైంది. ముఖ్యంగా ఈసారి పార్లమెంటు ఎన్నికలు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వేదికగా మారనున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ టికెట్ల కోసం ఆయా నేతల కుటుంబ సభ్యులు పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టాక.. ఆ పార్టీ నుంచి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి డిమాండ్ పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నాయకులు ఉండగా, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు పోటీ చేయగా, హన్మంతరావు ఓటమిపాలయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రెడ్డి పోటీ చేయగా ఇద్దరూ విజయం సాధించారు. ఇదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ పోటీచేసి విజయాలు సాధించారు. ఇక, గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, లేదా కుటుంబలో ఒకరికే అవకాశం వచ్చిన వారు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు అడుగుతున్నారు.
చర్చనీయాంశంగా... కుటుంబ వారసత్వ రాజకీయాలు
మరో మూడు నెలల్లోపే జరగనున్న లోక్ సభ ఎన్నికల్లకు కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారిలో ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న నాయకుల కుటుంబ సభ్యులు ఉండడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇరవై ఏళ్లుగా ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉంటున్న తనకు టికెట్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నల్గొండ టికెట్ కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే జానారెడ్డి చిన్న కొడుకు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి, మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి పోటీ చేయాలని ఆశిస్తూ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక, భువనగిరి ఎంపీ స్థానానికి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అంతే కాకుండా కోమటిరెడ్డి సోదరుని తనయుడు డాక్టర్ సూర్య పవన్ రెడ్డి కూడా టికెట్ అడుగుతున్నారు. ఒకే కుటుంబం నుంచి టికెట్లు కోరుతున్న తీరుపై పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మరో వైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరో మారు మేడ్చల్ ఎంపీ టికెట్ కోరుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కూడా టికెట్ కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ లోనూ
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడి రాజకీయ అరంగేట్రానికి లోక్ సభ ఎన్నికలను వేదికగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నల్లగొండ ఎంపీ టికెట్ లేదంటే.. భువనగిరి ఎంపీ టికెట్ ఏదో ఒకటి తమకు ఇవ్వాల్సిందేనని అధిష్టానం వద్ద రాయబారాలు జరుపుతున్నారు. సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఇప్పటి తమ ఆధ్వర్యంలోనే ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రత్యేకించి పలాన సీటు కావాలని అడగకుండా.. అయితే నల్గొండ, లేకుంటే భువనగిరి అంటూ టికెట్ కు బేరాలు మొదలు పెట్టారు. అమిత్ రెడ్డికి టికెట్ రాకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం కూడా జరగడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఏఏ జిల్లాలు వారసత్వ రాజకీయాలకు వేదిక కానున్నాయోనన్న ఆసక్తి నెలకొంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )