తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mp Komatireddy : సీఎం రేసులో నేను లేను, పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ గూటికే - కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Komatireddy : సీఎం రేసులో నేను లేను, పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ గూటికే - కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

17 May 2023, 18:11 IST

google News
    • MP Komatireddy : సీఎం అభ్యర్థి రేసులో తాను లేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి, జూపల్లి త్వరలో కాంగ్రెస్ లోకి వస్తాయన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (twitter)

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

MP Komatireddy : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి త్వరలో కాంగ్రెస్ లోకి వస్తారన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి క్యారెక్టర్ లేని వ్యక్తి అని విమర్శించారు. ఇప్పటికి మూడు పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. తన ఆస్తి మొత్తం తీసుకుని, నల్గొండలో గుత్తా సుఖేందర్ ఇల్లు ఇస్తే చాలని సవాల్ చేశారు. ఏం చేయకుండా 800 ఎకరాలు ఎలా కొన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టడంపై కోమటిరెడ్డి విమర్శలు చేశారు. కర్ణాటక ఫలితాలతో కేసీఆర్ భయం పట్టుకుందన్నారు. అందుకే 20 రోజులు తిరగకుండానే మళ్లీ మీటింగ్ పెట్టారన్నారు. బీఆర్ఎస్ పై రైతులు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పొంగులేటి, జూపల్లి టైంలో నిర్ణయం

"గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ చుట్టు పక్కల 800 ఎకరాలు కొన్నారు. నాకు నల్గొండలో ఇల్లు కూడా లేదు. నేను ఎమ్మెల్యే అయితే ఇక్కడే ఉంటాను. నా ఆస్తి మొత్తం తీసుకుని గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు ఇస్తే చాలు. పొంగులేటి, జూపల్లితో మాట్లాడాను. త్వరలో వాళ్లు కాంగ్రెస్ లో చేరుతారు. వారు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. ఈటల, రాజగోపాల్ రెడ్డితో మాట్లాడలేదు." - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం అభ్యర్థి రేసులో లేను

సీఎం అభ్యర్థి రేసులో తాను లేనని, తనకు సీఎం పదవి అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు లేదన్నారు. కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్‌లోనే వర్గపోరు ఎక్కువన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంతో అధిష్ఠానం సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏడాది క్రితమే ఊహించిందన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సీనియర్ల మధ్య విభేదాలు లేవు

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగులు, రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందన్నారు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో అన్నారు. కొందరు సీనియర్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

తదుపరి వ్యాసం