Komatireddy Venkat Reddy : రాజగోపాల్ రెడ్డి చేరికపై నిర్ణయం ఏఐసీసీదే, నాకేం తెలియదు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
25 October 2023, 14:03 IST
- Komatireddy Venkat Reddy : రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు తనకు తెలియదని ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి చేరికపై తుది నిర్ణయం ఏఐసీసీదే అన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నేతల జంపింగ్ స్పీడందుకుంది. టికెట్లు రాలేదనో, అధికారంలోకి వచ్చే అవకాశం లేదనో... కారణాలు ఏమైనా సరే గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయి నేతలు వరకు పార్టీలు మారుతున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. రాజగోపాల్ రెడ్డి చేరికపై ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక తనకు తెలియదని వెంకట్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి చేరికపై నిర్ణయం ఏఐసీసీదే అన్నారు. అతను నాతో ఏమీ చర్చించలేదని, అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని వెంకట్ రెడ్డి తెలిపారు.
రేపే కాంగ్రెస్ రెండో జాబితా
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదని, చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరికలు పెరిగాయన్నారు. తమను ఆదరిస్తున్న నల్లగొండ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, అక్కడ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బుధవారం మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉందన్న ఆయన, రెండో జాబితా ఇవాళ పూర్తవుతోందని, రేపు లిస్టు విడుదల అవుతుందని తెలిపారు. ఆరు స్థానాల్లో మాత్రమే పోటీ ఎక్కువగా ఉందని, మిగిలిన స్థానాల్లో దాదాపుగా అభ్యర్థులు ఖరారయ్యారన్నారు. మిగిలిన స్థానాల్లో రేపు ఉదయం ప్రకటన ఉంటుందని కోమటిరెడ్డి తెలిపారు.
కేటీఆర్ మీ ఆస్తులెంత?
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాశానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలకు నాలుగు సీట్లు కేటాయించామని, నాలుగు సీట్లంటే తక్కువేం కాదన్నారు. మిర్యాలగూడ సీటు కూడా అడిగారన్నారు. పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పేరు పలికే అర్హత కూడా మంత్రి కేటీఆర్ కు లేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదన్నారు. కానీ మంత్రి కేటీఆర్ ఆస్తులు ఎంతో అందరికీ తెలుసు అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి ఆధ్వర్వంలో బీఆర్ఎస్ నేతలు, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.