Minister Jagadish Reddy : కాంగ్రెస్ హామీలు బోగస్, కేసీఆర్ పథకాలను కాపీ కొట్టారు- మంత్రి జగదీష్ రెడ్డి
18 September 2023, 19:31 IST
- Minister Jagadish Reddy : తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పథకాలను కాపీ కొట్టి ప్రకటించారన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అన్న తరహాలో ఉన్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు అన్నీ బోగస్ అన్నారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటని, కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ ఏనాడూ లేదని పేర్కొన్నారు. 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఆకలి కేకలు మిగిలాయని విమర్శించారు. అధికారం కోసం స్థానిక కాంగ్రెస్ నేతల స్క్రిప్ట్ ప్రకారం అగ్ర నేతలు ఇచ్చిన హామీలు బఫూన్, బుడ్డర్ ఖాన్ లను తలపించేలా ఉన్నాయని తెలిపారు.
కేసీఆర్ పథకాలు కాపీ కొట్టారు
"ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రంలో అయినా తుక్కుగూడలో ప్రకటించిన పథకాలు అమలవుతున్నాయా? రాష్ట్రానికో మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్లు ఎక్కడా వెయ్యి రూపాయలు కూడా దాటలేదు. అబద్ధాలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించాలని చూస్తోంది. వారంటీలు లేని గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఆగం చేసింది’’ అని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
పోరాడి సాధించుకున్నాం
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ పదేపదే అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన కాలయాపన వల్లే ఆత్మబలిదానాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని ఆగ్రహించారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.