Nalgonda BRS : నల్లగొండలో అసమ్మతికి బీఆర్ఎస్ చెక్, తిరుగుబాటు నేత రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు
14 October 2023, 21:41 IST
- Nalgonda BRS : నల్లగొండలో అసమ్మతి నేతలకు బీఆర్ఎస్ చెక్ పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
పిల్లి రామరాజు యాదవ్
Nalgonda BRS : నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు ఏడాదికిపైగా కొన్నసాగిన ప్రచ్ఛన్న పోరుకు బీఆర్ఎస్ నాయకత్వం ముగింపు పలికింది. నల్లగొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇన్నాళ్లకు పార్టీ ఓ నిర్ణయం తీసుకుంది. నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో విభేదించి బయటకు వెళ్లిన పిల్లి రామరాజు యాదవ్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ, పార్టీ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కంచర్ల భూపాల్ రెడ్డికే రెండో సారి కూడా టికెట్ ఇచ్చింది. అయినా పిల్లి రామరాజు యాదవ్ వెనక్కి తగ్గకుండా సీఎం కేసీఆర్ బొమ్మలు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి బొమ్మలు పెట్టుకుని, గులాబీ కుండవాలు కప్పుకునే నియోజకవర్గంలో పర్యటనలు చేశారు. దీంతో పిల్లి రామరాజు యాదవ్ కు చివరిలో బీఫారం ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇది అధికారిక అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఏ కారణం చేతనో కానీ.. దాదాపు ఏడాది కాలంగా పిల్లి రామరాజు యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేసింది అధిష్టానం.
పిల్లి రామరాజును ప్రోత్సహించింది ఎవరు?
నల్లగొండ జిల్లా కేంద్రంలో కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేపై, ఆయన అనుచరుడు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై తిరుగుబాటు చేశారు. నాగార్జున సాగర్ లో ప్రత్యేక భేటీ అయ్యారు. తేరుకున్న ఎమ్మెల్యే కౌన్సిలర్లను తన దారికి తెచ్చుకున్నా పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్న కౌన్సిలర్ రామరాజు యాదవ్ మాత్రం వ్యతిరేకంగానే ఉండిపోయారు. పిల్లి రామరాజుకు జిల్లా నాయకులు ఇద్దరు అండదండగా ఉన్నారని, వారే ఎమ్మెల్యే కంచర్లకు ఇబ్బందులు కల్పించారన్న ప్రచారం జరిగింది. ఒక దశలో పిల్లి రామరాజును ప్రోత్సహిస్తోంది... శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అని కూడా ఎమ్మెల్యే వర్గం భావించింది. అదే మాదిరిగా, పిల్లి రామరాజు యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడంపై మంత్రి జగదీష్ రెడ్డి వైపు కూడా ఎమ్మెల్యే వర్గం వేలు చూపించింది. అధికారికంగా పార్టీ టికెట్ ఇచ్చినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇంకా ప్రచారం చేస్తున్నందున ఎట్టకేలకు పిల్లి రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తా
ఈ ఎన్నికల్లో కచ్చితంగా తాను పోటీ చేస్తానని బీఆర్ఎస్ తిరుగుబాటు నాయకుడు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాలను చుట్టివచ్చారు. మండలాల వారీగా సమావేశాలు కూడా జరుపుతున్నారు. శనివారం కూడా జిల్లా కేంద్రంలో కనగల్ మండల సమావేశం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ కుటుంబంలో వ్యక్తి చనిపోయినా.. ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా లేకుంటే ప్రతీ కుటుంబానికి పది వేల రూపాయల సాయం చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యే కంచర్లతో పొసగని వారిని చేరదీసి వెంట తిప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో చివరకు ఇండిపెండెంటుగానైనా పోటీ చేస్తానని పిల్లి రామరాజు ప్రకటించారు. బీఎస్సీ తమ పార్టీ తరపున బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ఆహ్వానించినా.. నల్లగొండలో అత్యధికంగా ఉన్న మైనారిటీ ఓట్లను పరిగణలోకి తీసుకుని బీజేపీ నాయకుల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేస్తారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అన్నది తేలాల్సి ఉంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )