తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode Politics : మునుగోడులో మారుతున్న రాజకీయం, రాజీనామాల బాటపట్టిన బీఆర్ఎస్ నేతలు

Munugode Politics : మునుగోడులో మారుతున్న రాజకీయం, రాజీనామాల బాటపట్టిన బీఆర్ఎస్ నేతలు

HT Telugu Desk HT Telugu

06 November 2023, 21:51 IST

google News
    • Munugode Politics : మునుగోడులో రాజకీయం మారుతోంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీరం చేరుతున్నారు. కూసుకుంట్ల తీరుపై ఆగ్రహంతో ఉన్న నేతలు రాజీనామాల బాటపట్టారు.
బీఆర్ఎస్
బీఆర్ఎస్

బీఆర్ఎస్

Munugode Politics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గులాబీ కండువాలు పక్కన పడేస్తున్నారు. పార్టీకి రాజీనామాలు చేసి కొత్త దారులు వెదుక్కుంటున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరును నిరసిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో మునుగోడులో ఎన్నికల రాజకీయం వేగంగా మారుతోంది.

అభ్యర్థిపై స్థానిక నేతల వ్యతిరేకత

మునుగోడు నియోజకవర్గంలో మారుతున్న రాజకీయం బీఆర్ఎస్ పైనే ఎక్కువగా ప్రభావం చూపేలా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బోల్తా పడింది. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండిన రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనివార్యమైన ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగినా అధికార బీఆర్ఎస్ తాకిడికి తట్టుకోలేక పోయారు. తమకు అభ్యర్థిని ప్రకటించాలని నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేసినా, ఉప ఎన్నికల్లో ప్రయోగం చేయడం ఎందుకని 2018 ఎన్నికల్లో ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే పోటీకి పెట్టి కష్టంగా నెగ్గింది. 2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక నాయకత్వం మరో మారు తమ డిమాండ్ వినిపించినా అధిష్టానం పెడచెవిన పెట్టి ఆయనకే తిరిగి బి ఫారం కూడా ఇచ్చింది. దీంతో ఇప్పుడు మునుగోడు బీఆర్ఎస్ నాయకులు ఎవరికి వారు తమ దారి తాము చూసుకుంటున్నారు.

బీఆర్ఎస్ కు రాజీనామాల బెడద

బీజేపీలో చేరి, ఉప ఎన్నికల అభ్యర్థిగా ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అభ్యర్థిత్వం ఖరారైన రోజు నుంచే రాజగోపాల్ రెడ్డి చక్రం తిప్పడం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న వారినంతా దగ్గర తీయడం మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగానే పలువురు బీఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. రేపో మాపో వారంతా కట్టకట్టుకుని కాంగ్రెస్ తీరం చేయడం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ ఛైర్మన్ ( చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ ) వెన్ రెడ్డి రాజు, నాంపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు జెడ్పీటీసీ సభ్యురాలు నారబోయిన స్వరూప రవి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, నాంపల్లి వైసీపీ ఎంపీపీ పానుగంటి రజినీ వెంకన్న, ఎంపీటీసీ సభ్యులు, పంచాయితీల వార్డు సభ్యులు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీక్ తదితరులంతా బీఆర్ఎస్ కు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు.

ఒంటెద్దు పోకడలు నచ్చకనే

‘‘మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరి, ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చకనే రాజీనామాలు చేశాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఉప ఎన్నికల్లో గెలిపించి తప్పు చేశాం. ఆయన ప్రవర్తనతో కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు ఉప ఎన్నిక తర్వాత పార్టీలో ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వలేదు. 2023 ఎన్నికల్లో కూసుకుంట్లకు డిపాజిట్ కూడా దక్కదు, ఆయన ఓటమి కోసమే పని చేస్తాం. సొంత పార్టీ వ్యక్తులపైనే అవిశ్వాస తీర్మానాలు పెట్టించిన గొప్ప నాయకుడు ఆయన. పేదల భూములు కాజేశాడు. కూసుకుంట్ల అక్రమాస్తులు, బినామీ ఆస్తులను బయటపెడతాం. సొంత పార్టీలోనే ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాం. త్వరలోనే మూకుమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం ’’ అని రాజీనామాలు చేసిన నాయకులు పేర్కొన్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

తదుపరి వ్యాసం