Karimnagar Crime: కరీంనగర్ లో సైబర్ క్రైమ్ క్రిమినల్స్.. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
12 July 2024, 8:48 IST
- Karimnagar Crime: కరీంనగర్ లో సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. సైబర్ క్రైమ్ పోలీసులు నగరంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్‌లో ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు
Karimnagar Crime: కరీంనగర్ లో సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. సైబర్ క్రైమ్ పోలీసులు నగరంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక దాడులతో కరీంనగర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సైబర్ క్రైమ్ కు అడ్డా గా మారిందనే ప్రచారంతో కలకలం సృష్టిస్తుంది.
కరీంనగర్ సైబర్ క్రైమ్ నేరగాళ్ళకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకుండా బాధితులు మాత్రమే కరీంనగర్ లో ఉన్నారనుకున్న తరుణంలో ఒకరిని ముంబాయ్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబాయి సైబర్ సెక్యూరిటీ పోలీసులు కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నగరానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ముందుగా ప్రచారం జరిగినప్పటికీ కరీంనగర్ పోలీసులు మాత్రం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ నిందితుడిని ముంబాయికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
గత మార్చిలో కేసు నమోదు..
గత మార్చి నెలలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాల కోసం కరీంనగర్ బ్యాంకులో ఖాతా ఉన్నట్లు గుర్తించిన ముంబై పోలీసులు కరీంనగర్ చేరుకొని ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.
కరీంనగర్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంకు ఖాతాను సెక్రటరీ , ట్రేసరీ వివిధ హోదాల్లో మొత్తం (07) ఏడుగురు సభ్యత్వాన ఒకే ఖాతాను తెరిచి మోసం చేసినట్లు గుర్తించారు.
ఆ ఆధారాల ఆధారంగా కరీంనగర్ చేరుకున్న ముంబై ఈస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు... సుభాష్ నగర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ (40) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు, మరో మహిళ పరారీలో ఉన్నారని పోలీస్ అధికారులు తెలిపారు.
కరీంనగర్ లో ముంబాయికి చెందిన సైబర్ సెక్యూరిటీ టీమ్ నగరంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని సాంకేతికత ఆధారంగా ఆరా తీసినట్లు ప్రచారం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో అంతర్జాతీయ సైబర్ క్రైం గ్యాంగ్ చేతులు కలిపి భారీ ఎత్తున నగదు బదలాయించుకున్నట్టుగా తెలుస్తుంది. భారతీయులను ఈ ఉచ్చులోకి దింపిన అంతర్జాతీయ ముఠాతో లింకులు ఉన్న వారి గురించి ముంబాయి సైబర్ సెక్యూరిటీ వింగ్ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.
ముంబాయ్ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ త్రి టౌన్ పోలీస్ స్టేషన్ కు వారిని తీసుకెళ్లిన ముంబాయి స్పెషల్ టీమ్ వారిని విచారిస్తున్నట్టుగా సమాచారం. అయితే వీరిని ముంబాయికి తరలించే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)