CCMB Study : ఈ జీవులు.. పిల్లలు కన్న 4 గంటల తర్వాత పునరుత్పత్తికి మళ్లీ సిద్ధం
08 December 2022, 17:01 IST
- Mouse Deer : మూషిక జింక.. అదే మౌస్ డీర్.. అతి బుల్లి జింక. దీనిపైన సీసీఎంబీ పరిశోధనలు చేస్తోంది. హైదరాబాద్ జూపార్కులోనూ ఇవి ఉన్నాయి. వీటి జీవనశైలి, సంతానోత్పత్తిపై శాస్త్రవేత్తలు పరిశోధలను చేస్తున్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మౌస్ డీర్
ప్రపంచంలో అంతరించిపోతున్న జీవాల్లో మూషిక జింకలు(Mouse Deer) కూడా ఉన్నాయి. ఇవీ చాలా చిన్నవిగా ఉంటాయి. క్రమేపీ అంతరించిపోతున్నాయి. నల్లమల(Nallamala) అభయారణ్యంలోనూ ఉన్నాయి.. కానీ తక్కువ. భారత్, శ్రీలంక వంటి దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. వీటి బరువు మూడు కిలోలే. కొమ్ములు ఉండవు. పగలు గుబురు పొదల్లో ఉంటాయి. రాత్రి పూట మాత్రమే బయటకు వస్తుంటాయి. వీటి గర్భదారణ సమయం కూడా ఆరు నెలలు మాత్రమే. గడ్డి పరకలు, ఆకులు, పండ్ల(Fruits)ను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి.
అయితే ఈ మౌస్ డీర్లపై సీసీఎంబీ(CCMB) పరిశోధనలు చేస్తోంది. అంతరించిపోతున్న ఈ జీవులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. వాటి పునరుత్పత్తిపై పది సంవత్సరాలుగా పరిశోధనలు(Research) జరుగుతున్నాయి. 12 నుంచి 15 అంగుళాల ఎత్తు ఉండే ఈ జీవులు... జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. వీటిని కాపాడేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. విచ్చలవిడిగా వేటాడటం కూడా.. ఇవి తగ్గిపోవడానికి ఓ కారణంగా ఉంది.
వాటి సంతతిని పెంచేందుకు సీసీఎంబీ(CCMB) శాస్త్రవేత్త డాక్టర్ ఉమాపతి బృందం పరిశోధనలు చేస్తుంది. హైదరాబాద్(Hyderabad) జూపార్క్ లో రెండు మగ, నాలుగు ఆడ మౌస్ డీర్లను పెంచుతున్నారు. బోనుల్లో వీటిని పెంచి ఆ తర్వాత అడవుల్లో విడిచి పెడతారు. కేవలం దట్టమైన అడవుల్లో జీవించే ఈ జింకలపై పరిశోధనలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాత్రి మాత్రమే ఈ బుల్లి జింక యాక్టివ్ గా తిరుగుతుంది.
మాస్ డీర్లు(Mouse Deer) ఫెరోమెన్లను విడుదల చేస్తూ.. లైంగిక సంపర్కానికి సమ్మతి తెలుపుతాయి. ఆడ జింకల్లో పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువని అని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పిల్లలు కన్న నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధిలో మళ్లీ పునరుత్పత్తికి రెడీ అవుతాయి. సాధారణంగా చూస్తే క్షీరదాల్లో 15 నుంచి 14 గంటల తర్వాత పునరుత్పత్తి వ్యవస్థ పనిచేస్తుందని, ఈ బుల్లి జీవులు మాత్రం అతి తక్కువ సమయంలో సంపర్కానికి సిద్ధంగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.