Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఆ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు!
16 April 2022, 7:14 IST
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది భారత వాతావరణ కేంద్రం. బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు మూడు డిగ్రీలు దిగ్గివచ్చిన ఉష్ణోగ్రతలు.. మరింత తగ్గే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మరో రెండు రోజుల పాటు ఉండనుంది. మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, హాకీంపేట్ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గద్వాల్, నాగర్ కర్నూల్, వికారాబాద్ లో ఎక్కువ వర్షాలు పడనున్నాయి. ఈ పరిస్థితి రేపు ఎక్కువగా ఉండనుంది. మిగిలిన ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు పడనున్నాయి. చాలా చోట్ల వాతావరణం కాస్త చల్లబడనుంది.
ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సీమ జిల్లాల్లోని ఈ పరిస్థితి ఎక్కవగా కనిపించింది. కర్నూలు, ఆళ్లగడ్డ, ఆహోబాలింలో గాలివాన బీభత్సం సృష్టిచింది. ఇక తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని.. బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
టాపిక్