Ramachandra Bharathi re-arrested : రామచంద్ర భారతి మళ్లీ అరెస్ట్.. ఏ కేసులో అంటే.. ?
22 December 2022, 23:38 IST
- Ramachandra Bharathi re-arrested : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ప్రధాన నిందితుల వ్యవహారంలో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిని పోలీసులు గురువారం మళ్లీ అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకి తరలించారు.
రామచంద్ర భారతి
Ramachandra Bharathi re-arrested : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిని బంజారాహిల్స్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఈ సారి నకిలీ పాస్ పోర్టు కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో రామచంద్ర భారతి అరెస్టు సమయంలో అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ ను పోలీసులు పరిశీలించారు. దొంగ డాక్యుమెంట్లతో నకిలీ పాస్ పోర్టు కలిగి ఉన్నాడని గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఏసీపీ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. రామచంద్ర భారతిని గురువారం అరెస్టు చేసి... నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకి తరలించారు.
మెయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రామచంద్ర భారతి, నందు, సింహయాజీలను పోలీసులు అక్టోబర్ 26న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసుపై దర్యాప్తు చేస్తోన్న సిట్.. నిందితుల్లో.. ఏ1గా రామచంద్ర భారతి, ఏ2 గా నందకుమార్, ఏ3 గా సింహయాజీలను పేర్కొంది. దాదాపు 42 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఈ ముగ్గురికీ బెయిల్ లభించగా.. రామచంద్ర భారతి, నందకుమార్ ని వేరే కేసుల్లో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. రెండు ఆధార్ కార్డులు, రెండు పాస్ పోర్టులు ఉన్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా రామచంద్ర భారతిని అప్పట్లోనే మళ్లీ అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశంపై సిట్ సభ్యుడు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ బంజారాహిల్స్ పోలీసులకి గతంలోనే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. గురువారం రామచంద్ర భారతిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకి తరలించారు. ఇతర కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న నంద కుమార్ సైతం చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.
మరోవైపు... మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సైతం దృష్టి సారించింది. ఈ కేసుకి సంబంధించి ప్రధాన ఫిర్యాదుదారు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. అతడి వ్యాపార భాగస్వాములుగా అనుమానిస్తున్న వారిపై నజర్ పెట్టింది. ఈ కేసులోఏ1, ఏ2 గా ఉన్న స్వామీజీలు.. రామచంద్రభారతి, సింహయాజిలను కూడా విచారించేందుకు త్వరలో ఈడీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం.