MLA Rekha Nayak : BRSకు ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా.. ఎన్నికల్లో సత్తా చూపిస్తానంటూ సవాల్
06 October 2023, 17:08 IST
- MLA Rekha nayak News: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు .వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఎంటో చూపిస్తానని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే రేఖానాయక్
MLA Rekha Nayak resigned: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్… ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. శుక్రవారం ఖానాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆమె… బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదంటూ… కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి.. తన సత్తా ఎంటో చూపిస్తానని సవాల్ విసిరారు. రెవెన్యూ డివిజన్ అడిగితే ఇవ్వలేదని… కాళ్లు మొక్కినా కనికరించ లేదని వాపోయారు. తననే కాదు ఖానాపూర్ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. మహిళలకు బీఆర్ఎస్ లో చోటు లేదని… అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఖానాపూర్ గడ్డ.. రేఖానాయక్ అడ్డా అని… ఇక్కడ మరో నేతను గెలవనివ్వనంటూ కామెంట్స్ చేశారు.
రెండుసార్లు గెలిచిన నియోజకవర్గంలో తనను కాదని తన చిన్నప్పటి మిత్రుడైన భూక్యా జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చుకున్నాడని కేటీఆర్ పై మండిపడ్డారు రేఖానాయక్. సొంత నియోజకవర్గంలో ఎందరో అర్హులున్నగా ఉన్నప్పటికీ ఎస్టీలను కాదని కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్సన్ కు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి భంగపాటు తప్పదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ ఎస్టీలను పక్కన బెట్టి బోథ్, ఆసిఫాబాద్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడం పట్ల ఆమె తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను అందరిలా కాదని, తన సత్తా ఏంటో చాటుతానని స్పష్టం చేశారు రేఖా నాయక్. ఖానాపూర్ లో బీ ఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళ ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు కొనసాగానని, అయినప్పటికీ తనకు టికెట్ ఇవ్వకుండా తన అభివృద్ధి పనుల నిధులను కూడా ఆపేయడం జరిగిందన్నారు. తాను ప్రజాబలంతో నియోజవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచానని… తాను ఏ పార్టీ మద్దతు లేకపోయినా కూడా బరిలో నిలుస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఇప్పుడే ప్రకటించలేనని… రెండు మూడు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు.