TS Co-operative Loans : కేవలం ఆ రుణాల రికవరీపైనే ఆదేశాలిచ్చాం - క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల
20 January 2024, 6:27 IST
- Telangana Co-operative Bank Loans : రైతు రుణాలను రికవరీ అంశంపై వ్యవసాయ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటిపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు మంత్రి తుమ్మల. ఇదే అంశంపై ప్రచురితమైన పలు వార్తలను ఆయన ఖండించారు.
మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Minister Tummala On Co-operative Bank Loans : సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నరుణాలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పటంతో ప్రతిపక్షపార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటి తప్పి… రైతు రుణాలను వసూళ్లు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. రుణాల వసూళ్ల అంశంపై క్లారిటీ ఇచ్చారు.
వాటిపై మాత్రమే ఆదేశాలు ఇచ్చాను - మంత్రి తుమ్మల
రైతు రుణాల వసూళ్లపై తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఇటీవల ఒక ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు ఫ్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా తీసుకుని బకాయిలు చెల్లించని వారిపై కటిన చర్యలు తీసుకుని,ఫాక్స్ సంఘాలను బలోపేతం చేయాలని చెప్పినట్లు వెల్లడించారు. అంతే కాకుండా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా DCCB,PACS లలో నాన్ అగ్రికల్చర్ లోన్లు తీసుకుని తిరిగి చెల్లించని ఎగవేతదారుల నుండి బకాయిలను వసూలు చేయాలని మాత్రమే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
కానీ కొన్ని పత్రికలు రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యయుతం కాదని హితవు పలికారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో రైతుల్లో భయాందోళనలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. ఇది రైతు ప్రభుత్వమని…,రైతుల మేలుకోరే ప్రభుత్వమని,గత ప్రభుత్వం లాగా రైతులను మభ్యపెట్టి కాలం వెళ్లదీసే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తల విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు,