KTR in Assembly : రాష్ట్రం ఆదుకుంటుంటే.. కేంద్రం చిన్నచూపుచూస్తోంది.... కేటీఆర్
10 February 2023, 21:18 IST
- KTR in Assembly : రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న చేనేత, జౌళి రంగాన్ని మోదీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.... పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
KTR in Assembly : చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే... కేంద్రం చిన్న చూపు చూస్తోందని.. మంత్రి కేటీఆర్ విమర్శించారు. చేనేత ఉత్పత్తులపై ప్రధాని మోదీ 5 శాతం పన్ను విధించారని.... ఆ మొత్తాన్ని 12 శాతానికి పెంచాలని చూస్తున్నారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న నేత కార్మికులని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన కేంద్ర సర్కార్... ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. చేనేత ఉత్పత్తులపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం పన్ను కూడా పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా... చేనేత రంగం, ఐటీ, పరిశ్రమలు సహా పలు శాఖలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా... మాట్లాడుతూ... భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కలిగించే చేనేత, జౌళి రంగాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్న కేటీఆర్... చేనేతకు సంబంధించిన అనేక బోర్డులను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా పవర్ లూమ్ బోర్డు... ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ బోర్డులను కేంద్రం రద్దు చేసిందని చెప్పారు. హైదరాబాద్ లో ఉండే ఆల్ ఇండియా జూట్ బోర్డు కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తొలగించారని... చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ ఆరోగ్య బీమా, బుంకర్ బీమా యోజనా పథకాలను తీసేశారని పేర్కొన్నారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వాలని... జమ్మికుంట, కమలాపూర్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని... మోదీ సర్కార్ మాత్రం తమ వినతులు పట్టించుకోలేదని అన్నారు.
కేంద్రం సహకరించుకున్నా... రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్నకు చేయూత అనే మంచి కార్యక్రమం తీసుకొచ్చామని... 26 వేల నేతన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని వివరించారు.
పరిశ్రమల పద్దుపై చర్చలో భాగంగా... గూగుల్ మ్యాప్ ల సాయంతో రాష్ట్ర ప్రగతిని మంత్రి కేటీఆర్ వివరించారు. కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల చిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోందని... 2014లో హైదరాబాద్ 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే.... 2023 నాటికి ఆ సంఖ్య 8.70 లక్షలకు చేరిందని వివరించారు. గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్న కేటీఆర్... ఇందులో రాష్ట్ర వాటా లక్షన్నర ఉద్యోగాలని చెప్పారు. ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటేసిందని పేర్కొన్నారు.
ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కొత్త సచివాలయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ఒకాయన ప్రగతి భవన్ పేల్చాలని అంటే.. ఇవాళ మరొకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నారని మండిపడ్డారు. తాము నిర్మాణాల కోసం పునాదులు తవ్వుతుంటే... వీళ్లేమో సమాధులు తవ్వుదాం, బాంబులు పెట్టి లేపేద్దాం అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక శక్తుల చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. పచ్చని మాగాణిగా మారిన తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టవద్దని ప్రజలను కోరారు.