తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Letter To Nirmala Sitaraman :నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ.. ఏమన్నారంటే ?

KTR Letter to Nirmala Sitaraman :నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ.. ఏమన్నారంటే ?

HT Telugu Desk HT Telugu

14 January 2023, 17:31 IST

google News
    • KTR Letter to Nirmala Sitaraman : ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. తెలంగాణ పారిశ్రామిక పురోగతికి బడ్జెట్ లో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలకు నిధులు కేటాయించి.. అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

KTR Letter to Nirmala Sitaraman : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు అండగా నిలిస్తే దేశానికి సహకరించినట్లేనని పేర్కొన్నారు. 8 ఏళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని.. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను తెలంగాణ అభివృద్ధి చేస్తోందని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యత ఉందన్న కేటీఆర్... పారిశ్రామిక రంగంలో రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలకు బడ్డెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని... హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగ్‌పూర్ హైదరాబాద్- విజయవాడ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి నిధులివ్వాలని... జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. బ్రౌన్‌ఫీల్డ్ మాన్యు ఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మంజూరు చేసి అప్‌గ్రేడేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలన్న కేటీఆర్... హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు.

"హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలి. ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలి. ఖమ్మంలో సెయిల్ ద్వారా సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందించాలి" అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేశారు కేటీఆర్. ఈ అంశాలపై 8 ఏళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి వచ్చే కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ వారం రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, వరంగల్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని ఇప్పటికే అనేసార్లు కోరామని.. ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతోందని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్ తో పాటు ఇతర పురపాలికల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని... లేదంటే ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా ప్రకటించాలని కోరారు. తెలంగాణలో 47 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని.. ఈ నేపథ్యంలో.. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు. భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో పురపాలికలను 68 నుంచి 142కు పెంచామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని లేఖలో కేటీఆర్ కోరారు.

తదుపరి వ్యాసం