KTR on BioAsia 2023 : ప్రపంచ హెల్త్ - టెక్ హబ్ గా హైదరాబాద్... కేటీఆర్
24 February 2023, 16:12 IST
- KTR on BioAsia 2023 : ప్రపంచ హెల్త్ - టెక్ హబ్ గా హైదరాబాద్ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్.. ఫార్మా.. హెల్త్ కేర్ రంగాలకు రాష్ట్రం నిలయంగా ఉందన్న ఆయన... 2030 నాటికి లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ వాల్యూ 250 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. హెచ్ఐసీసీలో 20వ బయో ఏషియా - 2023 ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
బయో ఏషియా-2023 సదస్సులో మంత్రి కేటీఆర్
KTR on BioAsia 2023 : లైఫ్ సైన్సెస్.. ఫార్మా.. హెల్త్ కేర్ రంగాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు మంత్రి కేటిఆర్. అధునాతన సౌకర్యాలు, మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ, మెడ్ టెక్ పార్క్ ఉన్న దేశంలోని ఏకైక నగరం హైదరాబాద్ అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ త్వరలోనే నగరంలో ఏర్పాటు కానుందని వెల్లడించారు. ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్న కేటీఆర్... వెయ్యికిపైగా లైఫై సైన్సెస్ కంపెనీలకి హైదరాబాద్ సేవలు అందించిందని చెప్పారు. హెచ్‌ఐసీసీలో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు జరుగనున్న 20వ బయో ఏషియా-2023 (Bio Asia) సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతోందని వెల్లడించారు.
దేశీయ ఔషధ ఉత్పత్తుల్లో 40 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయన్నారు కేటీఆర్. ఎఫ్డీఏ అనుమతి పొందిన 200 సంస్థలు తెలంగాణ నుంచే ఔషధ పరిశోధన, తయారీలో దూసుకుపోతున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు తర్వాత.. ఈ అంశాల్లో మరింత వృద్ధి నమోదు చేస్తామన్నారు. 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ విలువని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని గతంలో నిర్దేశించుకున్నామని... కానీ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల నుంచి వస్తోన్న ఆసక్తిని గమనిస్తే.. ఈ లక్ష్యాన్ని 2025 నాటికే అందుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 2022 నాటికే రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ 80 బిలియన్ డాలర్లను అందుకుందని చెప్పారు. గత ఏడేళ్లలో ఈ రంగంలో రాష్ట్రానికి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని... తద్వారా 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయని కేటీఆర్ వివరించారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలకు సంబంధించి ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీల్లో 4 సంస్థలకు హైదరాబాద్ లో కీలక కార్యాలయాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణ ద్వారా ఆయా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. డాక్టర్ రెడ్డీస్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, అరబిందో, హెటెరో, గ్లాండ్ ఫార్మా, విర్కో బయోటెక్ తదితర కంపెనీల కృషి ఫలితంగా... ఔషధాలు, వ్యాక్సిన్ల ఉత్పత్తికి హైదరాబాద్ కేంద్ర స్థానంగా తయారైందని చెప్పారు. అరెగాన్, సాయి, సింజెన్, డెలాయిట్, యాక్సెంచర్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ టెక్నాలజీ ద్వారా వృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. బయో సైన్సెస్ కు సంబంధించి దేశంలోనే గమ్యస్థానంగా తెలంగాణ అవతరించిందని... అయితే, తాము చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు కేటీఆర్. 2030 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ విలువని 250 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని... ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఉత్పత్తి.. పరిశోధన - ఆవిష్కరణ.. గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు.. సాంకేతికతతో హెల్త్ కేర్ రంగం అనుసంధానం .. అనే 4 పిల్లర్ల ఆధారంగా ముందుకు సాగుతామని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే ప్రపంచ హెల్త్ - టెక్ హబ్ గా హైదరాబాద్ అవతరిస్తుందని చెప్పారు. 2 ఏళ్ల తర్వాత బయో ఏసియా సదస్సుకి హైదరాబాద్ మళ్లీ వేదిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన... మూడు రోజుల సదస్సులో పాల్గొంటున్న సంస్థలు, కంపెనీలు, ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ వేదిక అనేక అవకాశాలకు దారులు తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.