TG Assembly Sessions 2024 : హరీష్ రావ్... నువ్వు ఏమైనా డిప్యూటీ లీడరా..? - మంత్రి కోమటిరెడ్డి
19 December 2024, 14:08 IST
- Telangana Assembly Sessions 2024 Updates : బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాలను నిర్లక్ష్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయబోతున్నామని చెప్పారు. హరీశ్ రావుపై మరోసారి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.
మంత్రి కోమటి రెడ్డి
పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువతో పాటు నల్గొండతో పాటు భువనగిరికి ఉపయోగం ఉండబోతుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… 2004 లో 1.60 లక్షలతో చిన్నగా ప్రారంభించామని.. ఆ తర్వాత 26 కోట్లు మంజూరీ చేయించామని పేర్కొన్నారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలోపే ప్రభుత్వం మారిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఈ పనులను పక్కన పెట్టిందని విమర్శించారు.
మూసీ డ్రైనేజీ నీళ్లతో పంటలు పండించే పరిస్థితి లేదని కోమటిరెడ్డి అన్నారు. పండిన పంటలను తినే పరిస్థితి లేదని సభలో ప్రస్తావించారు. “మా దగ్గర ఎక్కడ బోర్ వేసిన 1000 మీటర్లు పసుపు పచ్చగా నీళ్లు వస్తున్నాయి. క్రింద ఫ్లోరైడ్, పైన మూసీ ఉండటం మా నల్గొండకు దురదృష్టకరంగా మారింది. మూసీ నీళ్లతో నల్గొండ ప్రజలు దుర్బరంగా బ్రతుకుతున్నారు. 70 శాతం పూర్తయిన ఎస్ఎల్బీసీ ని పదేండ్లు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి… ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గ్రీన్ ఛానెల్ ఇచ్చారు. బ్రహ్మణవెల్లంలో 11 నెలల్లోనే క్రిందకు నీళ్లు వదిలిపెట్టాం. 2 రోజుల క్రితం 37 కోట్లు రూపాయలను భూసేకరణకు నిధులిచ్చాం. వచ్చేవారం 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ పూర్తి చేస్తాం” అని కోమటిరెడ్డి ప్రకటించారు.
“10 ఏండ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేసి 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా పనులు చేయకుండా ఆపారు. అందుకే, మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లక్షల మెజార్టీతో కాంగ్రెస్ సభ్యులను గెలిపించారు. దళితులు, గిరిజనులు, పేదవారు నీళ్లు లేక సచ్చిపోతున్నారు. వారి కోసమే గొంతెత్తుతున్నాను. ప్రతిపక్షనేత లేని పార్టీ సభ్యులు మాట్లాడే మాటలకు అర్ధం లేదు. హరీష్ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే.. ఎందుకు ప్రతిసారి మాట్లాడుతున్నారు..?” అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.