తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mini Medaram Jatara 2024 : తెలంగాణలో మినీ మేడారాల సందడి - 120 చోట్ల జాతరలు..!

Mini Medaram Jatara 2024 : తెలంగాణలో మినీ మేడారాల సందడి - 120 చోట్ల జాతరలు..!

HT Telugu Desk HT Telugu

23 February 2024, 13:54 IST

    • Mini Medaram Jataralu 2024 :తెలంగాణలో మినీ మేడారాల సందడి నెలకొంది. వరంగల్, చుట్టుపక్కల జిల్లాల్లో దాదాపు 120 చోట్లా జాతరలు జరుగుతున్నాయి. ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది.
మినీ మేడారం జాతర
మినీ మేడారం జాతర

మినీ మేడారం జాతర

Mini Medaram Jataralu 2024: సమ్మక్క–సారలమ్మ జాతర అంటే ఎవరైనా టక్కున చెప్పేది మేడారం పేరే. మొదట్నుంచీ అక్కడే జాతర జరిగేది కాబట్టి ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది. కానీ ఒకప్పుడు కేవలం మేడారంలో మాత్రమే నిర్వహించే ఈ జాతర కాలక్రమేణా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పాకింది. కొన్నేళ్ల కిందటి వరకు మేడారం కాకుండా బయట ఐదారు చోట్లా మాత్రమే జాతర జరిగేది. కానీ మొదటికి(మేడారం) వచ్చే భక్తుల రద్దీ, దూరం, అక్కడి ఇబ్బందులు, తదితర కారణాలతో చాలాచోట్లా సమ్మక్క–సారలమ్మ జాతర్లు నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ పుట్టుక, చరిత్రతో సంబంధం ఉన్న జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ జాతరలు జరుగుతున్నాయి. అయినా మొదటికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

దాదాపు 120 చోట్లా జాతరలు

ఉమ్మడి వరంగల్ లోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో రెండేళ్లకు ఒకసారి సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మేడారంలో నాలుగు రోజుల పాటు జాతరను గిరిజన సంప్రదాయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నాలుగు రోజుల సమయంలో నిత్యం లక్షల మంది భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సారలమ్మ, సమ్మక్క గద్దెలకు చేరే నాటి నుంచి తిరిగి వన ప్రవేశం చేసేంత వరకు ఏం తక్కవ రెండు కోట్ల మంది వరకు భక్తులు మొక్కులు సమర్పిస్తుంటారని అంచనా. దీంతోనే సమ్మక్క–సారలమ్మకు మొక్కులు చెల్లించాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయినా సమ్మక్క–సారలమ్మ ధీరత్వాన్ని దైవత్వంగా భావించి జనాలు తల్లులను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో మేడారం మహాజాతరలో ఫుల్ రష్ కనిపిస్తుంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చేందుకు దూర భారం, దారి పొడవునా ఇబ్బందులు, దర్శనానికి అవస్థలు పడాల్సి వస్తోందనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఎక్కడికక్కడ సమ్మక్క–సారలమ్మ గద్దెలను ఏర్పాటు చేశారు. మేడారం జాతర జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో కూడా ఘనంగా జాతర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ప్రాంతాలు చాలానే ఉండగా.. వాటిని ఆయా ప్రాంతాల ప్రజలు మినీ మేడారం జాతరలుగా పిలుచుకుంటుండటం విశేషం. ఇలా మొత్తంగా అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 120 చోట్లా సమ్మక్క–సారలమ్మ జాతరలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా క్షేత్రస్థాయిలో మరికొన్ని జాతరలు గ్రామస్థాయిలోనే జరుగుతుండటం గమనార్హం. వాటిని కూడా కలుపుకుంటే సమ్మక్క–సారలమ్మ జాతరల సంఖ్య వందల్లోనే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమ్మక్క పుట్టింది ఇక్కడేనంటూ..

రాష్ట్రంలో చాలాచోట్లా మినీ మేడారం జాతరలు జరుగుతుండగా.. అందులో కొన్ని గ్రామాల్లో సమ్మక్క పుట్టింది ఇక్కడనేంటూ ప్రచారంలో ఉంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహడ్ గ్రామంలోనే సమ్మక్క పుట్టిందని అక్కడి పూర్వీకులు చెబుతుంటారు. దీంతో ఇక్కడ సమ్మక్క–సారలమ్మ గద్దెలు ఏర్పాటు చేసి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి జాతరకు కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దీనిని మినీ మేడారంగా పిలుస్తుంటారు. ఇలాగే ఛత్తీస్ గడ్ లోనే సమ్మక్క పుట్టిందని అక్కడి ప్రజలు కూడా చాలాచోట్లా వనదేవతల జాతరలు నిర్వహిస్తుండటం విశేషం. ఇక సిద్దిపేట జిల్లాలోని అక్కెనపల్లి, పొట్లపల్లి, చిన్నకోడూరు, దేవక్కపల్లి తదితర గ్రామాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి, హుజురాబాద్ సమీపంలోని వీణవంక, శంకరపట్నం, రంగనాయకులగుట్ట, పెద్ద పల్లి జిల్లాలోని నీరుకుల్ల, గోదావరిఖని, మంచిర్యాల జిల్లా మందమర్రి, తంగెళ్లపల్లి మండలంలోని ఓబులాపురం తదితర చోట్ల కూడా మినీ మేడారం జాతరలు జరుగుతుంటాయి.

జనం తగ్గట్లే…

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సమ్మక్క–సారలమ్మ జాతరలు నిర్వహిస్తున్న మొదటికి(మేడారం) వెళ్లే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండగా.. ముందస్తు మొక్కులు పెట్టడానికి జనాలు తరలివస్తున్నారు. అయినా జార నిర్వహించే నాలుగు రోజుల్లో మేడారంలో రోడ్లన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. ఈ సారి ఏకంగా రెండు కోట్ల మంది వరకు భక్తులు తరలివస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కాగా.. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ గద్దెలపై కొలువుదీరారు. ఈ మూడు రోజుల్లో దాదాపు లక్షల మందికిపైగా మొక్కులు సమర్పించి ఉంటారని అంచనా వేస్తున్నారు. శనివారం సాయంత్రం సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం ఘట్టం నిర్వహించనుండగా, ఆ తరువాత కూడా భక్తుల రాకపోకలు సాగే అవకాశం ఉండటం గమనార్హం.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం