తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Meeting: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేడు బిఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశం..

BRS Meeting: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేడు బిఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశం..

HT Telugu Desk HT Telugu

27 April 2023, 7:57 IST

google News
    • BRS Meeting: తెలంగాణలో  మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో  పార్టీ  శ్రేణులకు బిఆర్‌ఎస్‌ అధినేత  దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Meeting: ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గురవారం కీలక సమావేశాన్ని నిర్వహిస్తు్నారు. తెలంగాణలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమావేశం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

టిఆర్‌ఎస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిఆర్ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన ప్లీనరీ స్థానంలో పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ అక్టోబరు 10న వరంగల్‌లో నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించారు. గురువారం జరిగే ప్రతినిధుల సమావేశానికి 279 మందిని మాత్రమే ఆహ్వానించారు.బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరు కానున్నారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సాయంత్రం వరకు కొనసాగనుంది. కేసీఆర్‌తోపాటు ఏడెనిమిది మంది ముఖ్య నాయకులు సమావేశంలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. బిఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమావేశం వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌... తొమ్మిదేళ్ల ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు మరోసారి వివరించనున్నారు.

మరికొద్ది నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రతినిధులను, కార్యకర్తలను సిద్ధం చేసేలా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు సందేశం అందేలా... అన్ని కీలక అంశాలపై కేసీఆర్‌ సమగ్రంగా ప్రసంగించనున్నారు. వచ్చే జూన్‌లో నిర్వహించనున్న పార్టీ యువజన, విద్యార్థి సమ్మేళనాలపైనా అధినేత దిశానిర్దేశం చేయనున్నారు.

ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్రసమితిగా రూపాంతరం చెంది, జాతీయ పార్టీగా అవతరించడం చారిత్రక అవసరమనే విషయాన్ని వేదికపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ, దేశానికి అవసరమైన నూతన పాలసీల రూపకల్పన అంశాలపై రాజకీయ తీర్మానాలు చేస్తారని చెబుతున్నారు.

వ్యవసాయం, సంక్షేమం, పల్లె, పట్టణ ప్రాంతాల్లో ప్రగతి, విద్య, వైద్యం, ఉపాధి తదితర స్థానిక అంశాల్లో తొమ్మిదేళ్లలో మారిన పరిస్థితులపైకేసీఆర్ ప్రసంగిస్తారని బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, మోదీ అన్యాయం చేస్తున్నారని మరికొన్ని తీర్మానాలు చేసే అవకాశముంది.

పార్టీ ప్రతినిధుల సమావేశంలో భారత చరిత్రలోనే తొలిసారి 125 అడుగుల డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నూతన సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకోవడం ద్వారా రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమర్పిస్తున్న సమున్నత గౌరవంపై, దళితబంధు అమలుపై కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు కూడా చేయనున్నారు.

తదుపరి వ్యాసం