Medchal Crime : మద్యానికి బానిసై వేధిస్తున్న కొడుకు, హత్య చేసి బావిలో పడేసిన తండ్రి
26 February 2024, 15:01 IST
- Medchal Crime : మద్యానికి బానిసైన కొడుకు తరచూ డబ్బులు కోసం వేధిస్తున్నాడని తండ్రి... అతడిని హత్య చేశాడు. ఈ ఘటనలో మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మద్యానికి బానిసై వేధిస్తున్న కొడుకు, హత్య చేసిన తండ్రి
Medchal Crime : మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం వేధిస్తూ ఉండడంతో కుమారుడిని కన్న తండ్రి హత్య(Murder)చేసిన సంఘటన ఆదివారం జీనోమ్ వ్యాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....మేడ్చల్(Medchal) జిల్లా షామీర్ పేట మండలం లాల్గుడి మలక్ పేట గ్రామానికి చెందిన కొరవి మంజుల, రామచంద్ర దంపతులకు ఇద్దరు కుమారులు, ఒకే కుమార్తె ఉన్నారు. పెద్దకొడుకు నరేష్ (27) మద్యానికి బానిసై డబ్బుల కోసం ప్రతిరోజు తల్లిదండ్రులను వేధించడమే గాక.....వారిపై దాడి చేసేవాడు. ఈ నెల 11న ఉదయం డబ్బులు ఇవ్వాలనీ తండ్రి రామచంద్రతో నరేష్ గొడవపడ్డాడు. అతని వైఖరితో విసిగిపోయిన తండ్రి రామచందర్ పథకం ప్రకారం..... డబ్బులు ఇస్తానని నమ్మించి నరేష్ ను గ్రామంలోని మార్గమల్లి బావి సమీపంలోకి తీసుకెళ్లి గొంతుపై కాలుతో తొక్కి హత్య చేశాడు. అనంతరం నరేష్ మృతదేహాన్ని బావిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈనెల 21న తల్లి మంజుల కుమారుడు కనిపించడం లేదని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు నరేష్ ఆచూకీ కోసం గత వారం రోజుల నుంచి గాలిస్తు్న్నారు. బావి నుంచి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బావిలో నరేష్ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి రామచంద్రే కుమారుడు నరేష్ ను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామచంద్ర ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మామిడికాయలు కోస్తుండగా విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మామిడికాయలు తెంపుతుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం......ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్వీష్ తన బంధువు రాజ్మాల్ తో కలిసి హిమాయత్ నగర్ టాటా షోరూం ఎదురుగా నివాసం అంటూ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేసేవాడు. ఆదివారం పర్వీజ్ వంట చేస్తుండగా రజ్వల్ సమీపంలోని మామిడి చెట్టుపై కాయలు కోసేందుకు బయటకు వెళ్లాడు. మామిడికాయలు కోసే క్రమంలో చెట్టుపైకి ఎక్కగా అతడు చేతిలో ఉన్న ఇనుపరాడు విద్యుత్ తీగకు తగలడంతో అపస్మారణ స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతడిని గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
కరెంట్ షాక్ తో భార్యాభర్తలు మృతి
వికారాబాద్ జిల్లా బోరంపేట్ మండల పరిధిలోని బూరాణాపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భోగిని లక్ష్మణ్ లక్ష్మీ భార్య భర్తలు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం లక్ష్మణ్ లక్ష్మీ ఉతికిన బట్టలను ఇంటి బయట తీగపై ఆరేస్తు ఉండగా.. ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. అనుకొని ప్రమాదంలో భార్యాభర్తలు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మణ్,లక్ష్మీ దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు. కూతుర వివాహం ఇటీవలే కాగా.....కొడుకు సిద్ధార్థ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి మృతిపై సమాచారం అందుకున్న ఎస్ఐ రఫీ పోలీస్ సిబ్బందితో ఘటన స్థలాన్ని చేరుకొని మృతులను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్