తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Buses To Medaram Jatara : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

TSRTC Buses To Medaram Jatara : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

HT Telugu Desk HT Telugu

05 February 2024, 20:21 IST

google News
    • TSRTC Buses To Medaram Jatara : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.
మేడారానికి 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు
మేడారానికి 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

మేడారానికి 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

TSRTC Buses To Medaram Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి(Medaram) వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చేస్తుంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.....భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యుయింగ్ కౌంటర్లు, కామారంలో మూడు బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్ ను పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్ లో టీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు సమ్మక్క, సారలమ్మలను(Sammakka Saralamma) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు సమ్మక సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమ్పరించుకున్నారు.

ఇప్పటివరకు 14.50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం

ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతరకు మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వారు నిర్దేశించారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar) బృందాన్ని ఈ సందర్బంగా అభినందించారు. ఈ నెల 16న మేడారంలో టీఎస్ఆర్టీసీ బేస్ క్యాప్ ను ప్రారంభిస్తామని తెలిపారు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది- సజ్జనార్

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.....మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతరకు 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోందని, రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఉమ్మడి వరంగల్(Warangal), కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించామని చెప్పారు. ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం