తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Accident : మెదక్ లో విషాదం, స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి

Medak Accident : మెదక్ లో విషాదం, స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి

HT Telugu Desk HT Telugu

30 January 2024, 20:30 IST

google News
    • Medak Accident : మెదక్ లో విషాద ఘటన జరిగింది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగానే చిన్నారి మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

Medak Accident : మెదక్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగింది. మెదక్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బిక్షపతి, నవీనల కుమార్తె అనుశ్రీ (6) పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుతుంది. అనుశ్రీ ఉదయం స్కూల్ కి బస్సులోనే వెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి బస్సులోనే వచ్చింది. ఆ చిన్నారి బస్సు దిగి వెళ్లే క్రమంలో అదే స్కూల్ బస్సు కింద పడింది. దీనిని గమనించని డ్రైవర్ బస్సుని ముందుకు కదిలించడంతో బస్సు టైర్ ఆ చిన్నారి పై నుంచి వెళ్లింది. దీంతో అనుశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతిని తట్టుకోలేక ఆ కుటుంబీకులు బోరున విలపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అనుశ్రీ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే చిన్నారి అనుశ్రీ మృతి చెందిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

బాలకార్మికులకు విముక్తి కల్పించాలి- మెదక్ కలెక్టర్ రాజర్షి షా

ఇటుక బట్టీలలో, రోడ్లపై భిక్షాటన చేసే చిన్నారులు, చిన్నారుల అక్రమ రవాణాలను గుర్తించి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వారికీ పునరావాసం కల్పించాలని, వారి సంక్షేమానికి కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో తనిఖీలు చేసి పిల్లలలో పోషణ లోపం అంశాలపైన చర్చించారు. ఈ అంశాలపైనా ప్రతి సూపర్ వైజర్, CDPOలు కచ్చితంగా ప్రతి నెలకి 20-25 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీకి ఎక్కువ మంది హాజరయ్యే విధంగా గ్రామాలలో అవగాహన కార్యక్రమములు చేయాలని సూచించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల పిల్లలని గుర్తించి వారి పేర్లు ఘర్ పోర్టల్ లో నమోదు చేసి, వారిని సొంత రాష్ట్రానికి పంపించి వారి స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. పోక్సో కేసులలో భాగంగా నష్ట పరిహారం త్వరగా అందేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. అల్లాదుర్గ్ లో అక్రమ దత్తత కేసులో ఒక బేబీని కాపాడి సంగారెడ్డి శిశు గృహంలో చేర్పించిన విషయాన్ని శిశుసంక్షేమ అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అదనపు కలెక్టర్ తెలిపారు. రామాయంపేట పరిధిలో ఐదేళ్ల అనాథ బాబును శిశు గృహంలో చేర్పించామన్నారు.

ట్రాక్టర్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు-నలుగురు విద్యార్థులు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట్ జిల్లా అలగూరులో సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విద్యార్థులు వర్ధమాన్‌ మహావీర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి కవటగిరిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరైన విద్యార్థులు తిరిగి ఇళ్లకు వస్తుండగా అలగూరులో ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. విద్యార్థుల మృతిపై సీఎం విచారం వ్యక్తంచేశారు. సీఎం సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

తదుపరి వ్యాసం