తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Congress : మెదక్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులు, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తామంటున్న నేతలు!

Medak Congress : మెదక్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులు, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తామంటున్న నేతలు!

HT Telugu Desk HT Telugu

24 September 2023, 21:50 IST

google News
    • Medak Congress : మెదక్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులున్నారని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో అధిష్టానం పెద్దలను కలిసి వారిపై ఫిర్యాదు చేస్తామంటున్నారు.
మెదక్ కాంగ్రెస్
మెదక్ కాంగ్రెస్

మెదక్ కాంగ్రెస్

Medak Congress : మెదక్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మా రెడ్డితో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పంతులు భూమయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు నాయకులు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ కమిటీ మెంబర్, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకున్ని ఉద్దేశించి భూమయ్య ఈ ఆరోపణలు చేశారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వీరిద్దరూ కూడా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున చురుకుగా పనిచేస్తున్నారు. భూమయ్య మాట్లాడుతూ.. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలలో వీళ్లిద్దరూ సునీత లక్ష్మా రెడ్డి ద్వారా బీఆర్ఎస్ నాయకుల తో టచ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవకుండా చేసేందుకు కాంగ్రెస్ లోని ఇద్దరు నేతలు అధికార పార్టీకి చెందిన సునీతాలక్ష్మారెడ్డితో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

త్వరలో ఏఐసీసీకి ఫిర్యాదు

మెదక్ జిల్లాలో అధికార పార్టీతో కలిసి మిషన్ భగీరథ పనులు చేసుకుంటూనే, కాంగ్రెస్ లో కొనసాగుతూ పార్టీని ఎదగనీయకుండా చూస్తున్నారని పంతులు భూమయ్య ఆరోపించారు. వీరి వ్యవహారంపై త్వరలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఈ నేతలకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇలానే బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ కు నష్టం చేస్తే కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భూమయ్య ఆరోపణలు మెదక్ కాంగ్రెస్ లో సంచలనం రేపాయి. సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి 1999, 2004, 2009లో మూడు సార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు, మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2018 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సునీత లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్ నేత చిలుముల మదన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో ఓడిపోయినా తరువాత, బీఆర్ఎస్ లో చేరిన సునీత లక్ష్మా రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆమె నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ రేసులో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావటం రెండు పార్టీలలో సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై కొద్దిరోజుల్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మిగతా సీనియర్ నాయకులను కలిసి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

తదుపరి వ్యాసం