South Central Railway : ఇకపై గంటకు 130 కిలో మీటర్ల వేగంతో రైళ్లు
11 September 2022, 20:45 IST
- ఇకపై గంటకు 130 కిలో మీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయి. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుందని.. సౌత్ సెంట్రల్ రైల్వే చెబుతోంది.
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో రైళ్లు ఇక నుంచి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రయాణికుల సమయం ఆదాతోపాటుగా.. రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుందని అధికారులు అనుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని మెజారిటీ సెక్షన్లలో సెప్టెంబర్ 12 నుండి అమలులోకి వచ్చే విధంగా రైలు సర్వీసుల గరిష్ట వేగాన్ని 110 kmph నుండి 130 kmphకి పెంచారు.
ఈ విభాగాల్లోని అడ్డంకులను వేగంగా తొలగించడం ద్వారా ట్రాక్, దాని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో ఈ మైలురాయిని చేరుకుందని SCR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, నిర్వహణ పనులు, సిగ్నలింగ్ అంశాలు 2020 సంవత్సరంలో RDSO/లక్నో అందించిన తర్వాత.. పర్యవేక్షించారు. అప్‌గ్రేడేషన్ పనులను చేపట్టింది SCR. ఇప్పుడు రైలు వేగాన్ని పెంచింది. సెప్టెంబరు 12 నుండి అమల్లోకి రానుంది.
ఈ స్పీడ్ ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ పరిధిలోకి వచ్చే విభాగాలలో సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్-కాజీపేట-బల్హర్షా, కాజీపేట-కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి-విజయవాడ-గూడూరు, గుంతకల్ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్-వాడి ఉన్నాయి.
ఈ విభాగాలు SCR మొత్తం హై-డెన్సిటీ రూట్, గోల్డెన్ చతుర్భుజ, గోల్డెన్ డయాగోనల్ రూట్‌లను కవర్ చేస్తాయి. గోల్డెన్ డైగోనల్ రూట్‌లోని విజయవాడ - దువ్వాడ మధ్య సెక్షన్ మినహా, పెరిగిన వేగం అమలు కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ విభాగాలలో గరిష్టంగా అనుమతించదగిన వేగాన్ని పెంపొందించడంతో ప్యాసింజర్ రైళ్లు అలాగే గూడ్స్ రైళ్ల సగటు వేగం మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కారణంగా రైళ్ల టైమ్ సేవ్ అవుతుంది. సెక్షనల్ స్పీడ్‌ని 130 కి.మీ.లకు పెంచడంలో సంబంధిత పనులను పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని ఇన్‌ఛార్జ్ SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.