Mancherial Sucides: మంచిర్యాలలో విషాదం, కొడుకు అప్పులకు బలైన కుటుంబం.. నలుగురు ఆత్మహత్య
12 December 2024, 7:59 IST
- Mancherial Sucides: మంచిర్యాల జిల్లా తాండూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది. కొడుకు చేసిన అప్పులు తీర్చలేక తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు విషాదంలో నింపింది.
తాండూరులో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
Mancherial Sucides: కొడుకు చేసిన అప్పులకు కుటుంబం మొత్తం ప్రాణాలు బలితీసుకోవాల్సి వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో లాభాల కోసం అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టడంతో నిండా మునిగిపోయిన యువకుడు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో తనతో పాటు తల్లిదండ్రుల ప్రాణాలను కూడా బలితీసుకున్నాడు.
షేర్ మార్కెట్ మాయలో పడిన యువకుడు అందులో పెట్టుబడుల కోసం ఎడాపెడా అప్పులు చేసిన యువకుడు తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బుధవారం తల్లిదండ్రులు సోదరితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య(60), శ్రీదేవి(50) దంపతులకు కుమార్తె చైతన్య(30), కుమారుడు శివప్రసాద్(26) ఉన్నారు. మొండయ్య తన ఇంట్లోనే కిరాణా దుకాణం నడపడంతో పాటు తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేసేవాడు. వచ్చిన డబ్బుతో వారి జీవనం సజావుగా సాగిపోతోంది. మొండయ్య కుమారుడు శివప్ర సాద్ గతంలో బెల్లంపల్లిలోని ఓ ల్యాబ్లో టెక్నీషియన్‌గా పని చేసి మానేశాడు. ఉద్యోగం చేసే సమయంలో షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు అలవాటైంది.
ఉద్యోగం మానేసిన తర్వాత ఇంటి దగ్గరే ఓ గదిలో స్టాక్ బ్రోకింగ్ కోసం ఏర్పాట్లు చేసుకొని షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. వ్యాపారంలో పెట్టుబడుల కోసం గ్రామంలో తెలిసిన వారి నుంచి అధిక వడ్డీలకు సుమారు రూ.60 లక్షలు వరకు అప్పులు చేశాడు. మార్కెట్‌లో నష్టాలు వస్తూ డబ్బులు పోగోట్టుకుంటున్నా ప్రతిసారి మళ్లీ రాకపోతాయా అనే నమ్మకంతో పెట్టుబడులు పెడుతూ పోయాడు. ఈ క్రమంలో ఆదాయం లేకపోగా వరుస నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేకపోయాడు. అప్పులు తీర్చాలని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి.
అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు తాళలేక మంగళవారం దివ్యాంగురాలైన అక్క చైతన్య, తల్లిదండ్రులతో కలిసి కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని తాగాడు. వీరిని గమనించిన స్థానికులు బెల్లంపల్లి ఆసుప త్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే బుధవారం తెల్లవారుజామున మొండయ్య, శ్రీదేవి, చైతన్య, మధ్యాహ్నం శివప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు.
శివప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అప్పులిచ్చిన వారి నుంచి ఎదురవుతున్న ఒత్తిడి తట్టుకోలేక శివప్రసాద్ ఏడాది క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో తాడేపల్లి పోలీసులు రక్షించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడినట్టు తాండూరు పోలీసులు వివరించారు.