Minister Harish Rao : బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్- రైతు బంధు, పింఛన్లు పెంచే ఆలోచన- హరీశ్ రావు
07 October 2023, 19:31 IST
- Minister Harish Rao : ఈ నెలలోనే బీఆర్ఎస్ వస్తుందని మంత్రి హరీశ్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.
మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో ఈ నెలలో వస్తుందన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయం ఎంత పెంచాలి? ఆసరా పెన్షన్లు ఎంత పెంచాలి? అని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి పథకానికి ఇంకా ఏం చేయాలి అని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాలకు దిమ్మతిరగాల్సిందే అన్నారు. మంచిర్యాలలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పింఛన్లు ఎంత పెంచాలి? రైతు బంధు ఎంత పెంచాలి? మహిళలకు ఇంకా ఏం సాయం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. కాంగ్రెస్ అంటే నయవంచన, ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ వస్తే కరవు, కర్ఫ్యూ
కేసీఆర్ పాలనలో కరవు, కర్ఫ్యూలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కర్ణాటక నుంచి డబ్బులు సంచులు తెచ్చి గెలవాలని కాంగ్రెస్ కలలు కంటోందన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆటలు సాగవన్నారు. ఆరు కిలోల బియ్యం, పగటి పూట కరెంట్ ఇస్తామని, తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కేసీఆర్ దిల్లీని గడగడలాడించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే కల్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు వచ్చేవా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
నడ్డా... తెలంగాణ కేసీఆర్ అడ్డా
నడ్డా.. తెలంగాణ కేసీఆర్ అడ్డా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీని గెలిపించుకోలేకపోయావని ఎద్దేవా చేశారు. అలాంటిది నడ్డా తెలంగాణలో ఏం చేస్తారంటూ విమర్శలు చేశారు. బీఎల్ సంతోష్ వచ్చి తెలంగాణలో హంగ్ వస్తుందని అంటున్నారని, ఈ రాష్ట్రంలో హంగ్ కాదు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందన్నారు. కచ్చితంగా కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఎల్ సంతోష్ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారని, సంతోష్ వస్తే బీజేపీ నామారూపాల్లేకుండా పోతుందన్నారు. గుజరాత్‌లో మూడు, నాలుగు సార్లు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడవచ్చు, కేసీఆర్ తెలంగాణలో మూడు సార్లు గెలవొద్దా? అని ప్రశ్నించారు. గుజరాత్ కన్నా తెలంగాణ పాలన వందశాతం నయం అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.