Singareni Elections: సింగరేణి ఎన్నికలు వాయిదా కోరిన యాజమాన్యం
19 December 2023, 8:15 IST
- Singareni Elections: సింగరేణి ఎన్నికలు మరికొద్ది రోజులు వాయిదా వేయాలంటూ సంస్థ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సింగరేణి ఎన్నికలు
Singareni Elections: సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది.
డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికలను వాయిదా వేయాలని సంస్థ యాజమాన్యం పిటిషన్‌లో కోరింది. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఏడాది అక్టోబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కార్మిక సంఘం తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణలు కౌంటరు దాఖలు చేయడానికి గడువు కోరడంతో ధర్మాసనం అనుమతిస్తూ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుతం ఎందుకు వాయిదా కోరుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరి కొద్ది రోజులే అయ్యిందని, ఎన్నికల నిర్వహణకు కొంత గడువు కావాలని యాజమాన్యం అభ్యర్థించింది. దీనిపై కోర్టు విచారణ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.