Singareni Jobs: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం ఆపాలని కార్మిక సంఘం డిమాండ్
19 December 2023, 13:20 IST
- Singareni Jobs: సింగరేణిలో జూనియర్ 171 అసిస్టెంట్ పోస్టుల నియామకం ఆపాలని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ గుర్తింపు కార్మిక సంఘం ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
సింగరేణిలో ఉద్యోగ నియామకాలు ఆపాలని సిఎంకు లేఖ
Singareni Jobs: సింగరేణి యూనియన్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో 171 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నియామక ఉత్తర్వులు విడుదలయ్యాయని, దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
కొత్త ప్రభుత్వం ఆమోదం లేకుండా, సీఎంకు, ఇంధన శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా సీఎండీ శ్రీధర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కో పోస్టును రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఈ మేరకు నాలుగు పేజీలతో సీఎం రేవంత్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. లేఖలో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. `రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని, కొత్త ప్రభుత్వ అనుమతి లేకుండానే సీఎండీ శ్రీధర్ నియామక ఉత్తర్వులు విడుదల చేశారని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని కోరారు.
`సింగరేణి సీఎండీగా శ్రీధర్ నియామకం తర్వాత, సింగరేణి రిక్రూట్మెంట్ సెల్ నిరంతర అక్రమాల కారణంగా దాని విశ్వసనీయతను కోల్పోయిందని తెలంగాణలో సీఎండీగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో ఉద్యోగాలు మార్కెట్లో కూరగాయల్లా అమ్ముడవుతున్నాయని బహిరంగ చర్చ జరుగుతోందని సింగరేణి రిక్రూట్మెంట్‌లపై అనేక ఆరోపణలు, వార్తాకథనాలు, పోలీసు కేసులు నమోదవుతున్నాయి.
గతంలోనూ ఆరోపణలు…
గతంలో జరిగిన నాలుగు రిక్రూట్మెంట్లపై ఆరోపణలు ఉన్నాయి. 2015లో 471 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియాకమం కోసం జెన్‌టీయూహెచ్‌ను రిక్రూట్మెంట్ ఏజెన్సీగా నియమించారు. ప్రశ్నాపత్రం లీక్ చేయడం ద్వారాఆ దాదాపు 150 మంది అభ్యర్థులు ప్రయోజనం పొందారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 20 లక్షలు వసూలు చేశారు. దాదాపు 200 పోస్టుల కోసం దాదాపు వందల కోట్ల డబ్బు చేతులు మారినట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది.
సింగరేణి రిక్రూట్మెంట్ సెల్ లో దశాబ్దాలుగా ఉన్న పారదర్శకత కుప్పకూలిందని, శ్రీధర్ మరియు బీఆర్ ఎస్ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, దురాశ, కుంభకోణాల వల్ల సింగరేణి రిక్రూట్మెంట్ వ్యవస్థపై యువత నమ్మకం కోల్పోయిందని ఓయూ జేఏసీ పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగాల విక్రయానికి కోల్ బెల్ట్ ప్రాంతమంతా బ్రోకర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. సింగరేణి ఉద్యోగాల విక్రయం గురించి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. ఫలితంగా ఉత్తర భారతదేశానికి చెందిన రిక్రూట్మెంట్ మోసగాళ్లు సింగరేణి రిక్రూట్మెంట్లలోకి కూడా ప్రవేశించారని తర్వాత సర్వేయర్ ట్రైనీ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగింది. ఇంటర్నల్ విజిలెన్స్ సర్వేయర్ ట్రైనీ రిక్రూట్మెంట్స్కా మ్ గురించి విచారించగా సర్వేయర్ ట్రైనీ స్కామ్ గురించి మాత్రమే కాకుండా జూనియర్అ సిస్టెంట్ స్కామ్ గురించి కూడా అనేక వివరాలను వెలువడ్డాయి.
ఈ రిపోర్ట్ వస్తే కటకటాల వెనక్కి వెళ్తామని, విజిలెన్స్ నివేదికను బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఇప్పటి వరకు ఆ విజిలెన్స్ నివేదిక వెలుగులోకి రాలేదని ఆరోపించారు. తర్వాత ఎంటీఅండ్ ఈఎం రిక్రూట్మెంట్లో హైటెక్ అవకతవకలు జరిగాయని ఉత్తర భారతదేశానికి చెందిన ముఠాలు కూడా పోలీసులకు చిక్కాయి.
పోలీసుల విచారణ పూర్తికాకుండానే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు జారీ చేశారని ఫిర్యాదు చేశారు. జెఎన్‌టీయూహెచ్ పై 2015 జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ విషయములో అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నా 2022లో మళ్లీ 171 పోస్టుల జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించడానికి ఏజెన్సీగా నియమించారు.
రిక్రూట్‌మెంట్ సెల్‌లో అప్పటివరకు ఉన్న డైరెక్టర్ బలరాం నాయక్‌ను తీసివేసి సీఎండీ శ్రీధర్ అనుచరుడైన డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేకర్ ని డైరెక్టర్ గా నియమించారు. ఈ పరీక్ష జరిగిన తరువాత మళ్లీ బలరాం నాయక్ ను డైరెక్టర్ గా నియమించారని ఈ పరీక్షలో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గోవాలో కొన్ని ముఠాలు పట్టుబడ్డాయి. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో, మణుగూరులో కొందరు ఏజెంట్లు పట్టుబడ్డారని పేర్కొన్నారు.
యూనియన్ ఎన్నికల కోడ్ ఉన్నా నియామక ఉత్తర్వులు విడుదలయ్యాయని త్వరలో సింగరేణి నుంచి సీఎండీ శ్రీధర్‌ను తప్పించే అవకాశం ఉందని చర్చ జరుగుతోందని అదే కారణంతో అతను తొందరపడి 171 జునియర్ అసిస్టెంట్ పోస్టులకు నియామక ఉత్తర్వులు విడుదల చేశారని ఆరోపించారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున మెడికల్ బోర్డు సమావేశాలు నిలిచిపోయాయని, అసిస్టెంట్ రిక్రూట్మెంట్‌పై చాలా ఆరోపణలు ఉన్నందున దీనిపై సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలి` అని లేఖలో కోరారు.