KTR Vs Ponnam: RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలపై కేటీఆర్ వర్సెస్ పొన్నం, వైరల్ వీడియోలపై విచారణకు పొన్నం డిమాండ్
31 July 2024, 13:15 IST
- KTR Vs Ponnam: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వ్యవహారంపై అసెంబ్లీలో మంత్రి పొన్నం, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై సిఎం రేవంత్ రెడ్డి స్పందనకు ఆగ్రహంతో బీఆర్‌ఎస్ సభ్యులు పోడియం ముట్టడించారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాలపై కేటీఆర్‌తో పొన్నం వాగ్వాదం
KTR Vs Ponnam: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాల వల్ల ఆర్టీసీ కార్మికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం చేయాలని పట్టుబట్టారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం జోక్యం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రష్ చేస్తున్న దృశ్యాలు, వెల్లుల్లి ఒలిచే వీడియోలపై విచారణ జరపాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం ఇష్టమో కాదో బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చామని ఇప్పటి వరకు 70కోట్ల మంది డిసెంబర్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు.
ఆటో కార్మికులు గతంలో మెట్రో వచ్చినపుడు, ఉబర్, ఓలా వచ్చినపుడు ప్రభావితం అయ్యారని, అప్పుడు ఆటోలకు ఇబ్బంది రాలేదా అని ప్రశ్నించారు. ప్రతి దశలో ప్రభావితమయ్యే వర్గాలు ఉంటాయని, కానీ మహిళలకు ఉచిత ప్రయాణాలపై అక్కసు ప్రదర్శించొద్దన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వీడియోలు వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆటో కార్మికుల సమస్యలపై చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి సమాధానంపై స్పందించిన కేటీఆర్ ఇప్పటి వరకు ఆటో కార్మికులు 59మంది చనిపోయారని వారికి సాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో బస్సుల సంఖ్యను పెంచాలని, ఉచిత ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, ఎన్నికేసులు పెట్టారో జాబితా సభాపతికి అందిస్తున్నామని, వాటికి కట్టడి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన సహా అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉంటామన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తామని, ప్రజలకు నష్టం చేస్తే ఎంతవరకైనా పోరాడతామని, ప్రత్యర్థుల్ని పాతరేస్తామన్నారు.
ఆ పెట్టుబడులు బోగస్…
తెలంగాణలో రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత రూ.40వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ చేసిన ప్రకటనపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. వచ్చిన పెట్టుబడుల్లో రూ.8వేల కోట్ల ను మహేష్ ఘోడీ అనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారని, కానీ దాని మూలధనం కోటి 70లక్షలు మాత్రమేనని కేటీఆర్ చెప్పారు.
గోడీ ఇండియా కంపెనీ పెట్టుబడులు బోగస్ అని కేటీఆర్ ఆరోపించారు. 31శాతం షేర్లు నష్టాల్లో ఉన్నాయని, దావోస్ పెట్టుబడులపై అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని చెప్పారు. గోడీ ఇండియా 27లక్షల నష్టాల్లో ఉందని, 41వేల కోట్ల పెట్టుబడులని అసత్యాలు చెప్పారని ఆరోపించారు.
2022 ఏప్రిల్ 20న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ కేసీఆర్ సిఎంగా ఉన్నపుడు 1500మెగా వాట్ల సామర్థ్యంతో 9500కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటన చేశారని, వాటిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు.