తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Merging In Bjp: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సద్దుమనగని వివాదం.. ప్రచారానికి తెరదించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం

BRS Merging In BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సద్దుమనగని వివాదం.. ప్రచారానికి తెరదించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం

HT Telugu Desk HT Telugu

16 August 2024, 12:53 IST

google News
    • BRS Merging In BJP: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో విలీనం అయిపోతుందని.. కొద్ది రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. బీఆర్ఎస్ నాయకులు ఇది అబద్దపు ప్రచారమని ఎంత కొట్టి పారేసినా.. ఈ ప్రచారానికి తెర పడడం లేదు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో మారు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటే, తమ ఆటలు సాగవని భావిస్తున్న వారే.. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ ఏమన్నారంటే..

'వాడోకడు, వీడొకడు తయారైండు. బీఆర్ఎస్ ఇక ఉండదు. బీజేపీలో విలీనం అవుతదని అడ్డమైన ప్రచారం చేస్తుండ్రు. ఈ పార్టీ ఉండొద్దని, నాశనం కావాలని కోరుకుంటున్నరు. నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను. కవిత అన్నను. ఇవ్వాళ్టికి మా ఇంటి ఆడబిడ్డ జైల్లో ఉండబట్టి 150 రోజులు. నేను ఢిల్లీకి వెళ్లి లాయర్లతో బెయిల్ కోసం మాట్లాడొద్దా. కవితకు ధైర్యం చెప్పొద్దా. ఏమన్న అంటే బీజేపీ కాళ్లు మొక్కిండు, లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా..? ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా..? మా పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ 24 ఏళ్ల పాటు ఈ పార్టీ విజయవంతంగా కొనసాగింది. మరో 50 ఏళ్లు కొనసాగేటట్లు బలంగా తయారు చేసుకున్నం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

పార్లమెంటు ఎన్నికల తర్వాతే విలీనం ప్రచారం..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమీ పాలైంది. 2018 ఎన్నికల్లో సొంతంగా గెలిచిన 88 స్థానాల స్థానే.. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ 39 స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ కనీసం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి డబుల్ ఎంపీ సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ- బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ మొదట్నుంటీ ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఈ విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ఆరోపణలు అందుకే..

10 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ కావాలనే సాధారణ అభ్యర్థులను పోటీకి పెట్టిందని.. తమ గెలుపు అవకాశాలని దెబ్బకొట్టేందుకు బీజేపీకి సహకరిస్తోందని రేవంత్ ఆరోపించారు. బీజేపీ బి-టీమ్‌గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్టయ్యారు. 150 రోజులుగా జైలులో ఉన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ దొరకండం లేదు. దీంతో కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎంతగా ఖండించినా ప్రచారం ఆగలేదు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం నాడు ఇదే అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

ప్రచారం ఎందుకు జరుగుతోంది..?

ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో.. ప్రధానంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో, మెయిన్ మీడియాలో కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోందని ప్రచారం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విలీన కార్యక్రమం ఉంటుందని.. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ప్రచారం మొదలైంది. లిక్కర్ కేసులో జైలులో ఉన్న కవితను ములాఖత్ లోకలిసేందుకు.. బెయిల్ కోసం ఢిల్లీలో లాయర్లతో మాట్లాడేందుకు కేటీఆర్ తరచూ ఢిల్లీ వెళుతున్నారు. ఈ క్రమంలో విలీనం ప్రచారం ఊపందుకుంది.

బీఆర్ఎస్‌కు బీటలు..

పార్లమెంటు ఎన్నికల పలితాల తర్వాత బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ బాట పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వరసకట్టి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తోందని, అసలు బీఆర్ఎస్ శాసన సభాపక్షం లేకుండా పోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని అడ్డుకోలేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం కావడం.. అయిదు నెలలుగా కవితకు బెయిల్ రాకపోవడం వంటి కారణాలతో.. బీఆర్ఎస్ పని అయిపోయిందనే పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి.

( రిపోర్టింగ్: క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

తదుపరి వ్యాసం