CKM Hospital Kidnap: సీకేఎం హాస్పిటల్ లో పసికందు కిడ్నాప్, 48 గంటల్లోనే ఛేదించిన వరంగల్ పోలీసులు
10 September 2024, 6:27 IST
- CKM Hospital Kidnap: మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మగ శిశువును ఆదిలాబాద్ జిల్లాలో ఉండే ఓ లేడీ కిడ్నాప్ చేసింది. మంచిర్యాల హాస్పిటల్ నుంచి వరంగల్ సీకేఎం ఆసుపత్రికి తీసుకొచ్చి.. ఆ తరువాత అపహరించుకుపోయింది. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
కిడ్నాప్‌కు గురైన బాలుడిని తల్లికి అప్పగిస్తున్న పోలీసులు
CKM Hospital Kidnap: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన బాలుడి అచూకీని పోలీసులు 48 గంటల్లో కనిపెట్టారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా సార్కాని గ్రామానికి చెందిన జుగునకే సునీత ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో పని చేసేది.
సునీత తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి లాక్ డౌన్ సమయంలో కరోనాతో మృతిచెందింది. దీంతో ఆదిలాబాద్ సుందరయ్య నగర్ లో ఇల్లు కిరాయికి తీసుకున్న సునీత నాలుగేళ్ల నుంచి అదే ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలోనే సునీతకు ఉట్నూరు మండల కేంద్రానికి చెందిన ఆత్రం ఆనందరావుతో పరిచయం ఏర్పడగా.. ఆ తరువాత ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుని సుందరయ్య నగర్ లోని అద్దెంట్లోనే ఉండేవారు.
ఆ తరువాత కొద్ది రోజులకు ఆనందరావు సునీతకు కొద్దికొద్దిగా దూరమయ్యాడు. వేరే వాళ్లతో మాట్లాడుతూ సునీతను పట్టించుకోవడం మానేశాడు. మూడు నెలల కిందట సునీతను ఒంటరిగా వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
మంచిర్యాల లో ట్రాప్.. వరంగల్ లో కిడ్నాప్
ఆనందరావు దూరం కావడంతో ఒంటరితనాన్ని భరించ లేకపోయిన సునీత ఎవరైనా ఒక చిన్న బాబుని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఎక్కడి నుంచైనా బాబును తీసుకొచ్చుకోవాలని పథకం వేసింది. ఈ మేరకు దాదాపు 10 రోజుల కిందట కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ కు వెళ్లింది. కానీ అక్కడ తనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడంతో అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది.
అక్కడ కొందరు గోండువాళ్లు కనబడగా తను కూడా గోండు భాషలో మాట్లాడి వారితో పరిచయం పెంచుకుంది. అక్కడ వారి సమస్య ఏంటని తెలుసుకోగా.. ఓ వ్యక్తి తన భార్య ఏడు నెలలకే ప్రసవించిందని, ముందస్తుగా పుట్టిన బాబును బాక్స్ లో పెట్టారని చెప్పాడు. దీంతో ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సునీత ప్లాన్ వేసింది. వాళ్లని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి బాబును ఎత్తుకెళ్లాలని పథకం వేసుకుంది.
తన ప్లాన్ లో భాగంగానే బాబుకి సీరియస్ గా ఉందని, ఇక్కడ సరిగా ట్రీట్మెంట్ చేయరంటూ వారిని నమ్మించింది. వరంగల్ లోని ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బాగా ట్రీట్మెంట్ జరుగుతుందని వారిని ఒప్పించింది. అక్కడి డాక్టర్లతో మాత్రం వేరే ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుంటామని చెప్పి వారిని వరంగల్ కి తీసుకుని వచ్చింది, బాలుడిని పేరెంట్స్ ను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకుని వచ్చి.. వారిని బయటనే ఉండమని చెప్పింది. తానే బాలుడిని అడ్మిట్ చేస్తానని లోపలికి వెళ్లి అడ్మిట్ చేసింది.
ఆ మరుసటిరోజు బాబు తండ్రి ఇక్కడ ట్రీట్మెంట్ అవసరం లేదని, ఇంటికి వెళ్లి పోతామని చెప్పగా.. బాబు కండీషన్ సీరియస్ గా ఉందని వారిని భయపెట్టింది. బాబును వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని కంగారు పెట్టింది. అందుకు సరిగా ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ కు బదులు వరంగల్ నగరంలోని వేరే ఆసుపత్రి కి తీసుకెళ్లి అక్కడ చూపెట్టిన తర్వాత మంచిర్యాలకు తీసుకెళ్దామని చెప్పి సీకేఎం ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వాళ్లందర్నీ హాస్పిటల్ బయటనే ఉంచి, లోపలికి వెళ్లి డాక్టర్ కి చూపెట్టి వస్తానని చెప్పి వాళ్ళ కళ్లుగప్పి అక్కడి నుంచి బాబుని తీసుకుని ఉడాయించింది.
48 గంటల్లో ట్రేస్ చేసిన పోలీసులు
వరంగల్ సీకేఎం ఆసుపత్రి నుంచి 7వ తేదీ మధ్యాహ్నం బాబును కిడ్నాప్ చేసిన సునీత నేరుగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్ మీదుగా తన సొంతూరు అయిన సార్కానికి వెళ్లింది. కాగా బాబు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా రోధించారు. తమ బిడ్డను తమకు అప్పగించాల్సిందిగా విలపించారు. చివరకు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని గుర్తించారు. ఇదిలాఉంటే సార్కానికి వెళ్లిన సునీత అక్కడి నుంచి ఆదిలాబాద్ వెళ్లేందుకు ఉట్నూరు చేరుకోగా.. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని ఉన్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని, బాబుతో సహా వరంగల్ కు తీసుకొచ్చారు. అనంతరం సోమవారం సాయంత్రం వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ చేతుల మీదుగా బాలుడిని తండ్రి రాజేష్ కు అప్పగించారు.
అనంతరం ఏడు నెలల వయసుతో పుట్టిన బాబును ట్రీట్మెంట్ కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. నిందితురాలు సునీతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పసికందుని అపహరించిన కేసులో 48 గంటల లోగానే నిందితురాలిని, బాబుని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)