Panchayat Elections : పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం, రిజర్వేషన్లు మారేనా?
10 December 2023, 19:11 IST
- Panchayat Elections : వచ్చే ఏడాది జనవరి 31 తేదీతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. ఫిబ్రవరిలో ఎన్నికల జరగాల్సి ఉంది. అయితే రిజర్వేషన్లు ఖరారు, కొత్త పంచాయతీ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికలు
Panchayat Elections : తెలంగాణలో మరో ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31వ తేదీతో ముగుస్తుంది. దీని ప్రకారం 2024 ఫిబ్రవరి నుంచి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావాల్సి ఉంది. 2018లో పాలకవర్గం స్థానిక సంస్థల రిజర్వేషన్లు మొదటి 5 సంవత్సరాలకు ఒక కాల పరిమితి, మరో 5 సంవత్సరాలకు మరో విధంగా కాకుండా ఈ రెండు పర్యాయాలు కూడా సర్పంచులు, వార్డు సభ్యులు 10 సంవత్సరాల కాలానికి ఒకే రిజర్వేషన్లుకొనసాగుతుందని నాటి టీఆర్ఎస్ సర్కారు చట్టం చేసింది.
రిజర్వేషన్లుమారుతుందా?
కాగా ఈ చట్టాన్ని రూపొందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం రూపొందించిన 10 సంవత్సరాల కాల పరిమితితో పాటు రెండు పర్యాయాల రిజర్వేషన్లు మారుస్తుందా? లేదా అనేది ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ అంశం గ్రామ స్థాయిలో నాయకుల మధ్య సమాలోచనలకు కారణమైంది. మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ లేక వార్డు సభ్యుల పదవుల కోసం సిద్ధమవుతున్న ఆశావహులు ఎంతో ఉత్కంఠను ఎదుర్కొంటూ రిజర్వేషన్లుపై ఆశతో ఎదురు చూస్తున్నారు. తాజాగా జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతుందా? లేదా అని రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లుఆశావహులు అవకాశం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
పెరగనున్న పంచాయతీలు
గవర్నర్ వద్ద రాష్ట్రంలోని 224 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ఫైల్ పెండింగ్ లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 224 గ్రామ పంచాయతీల ఏర్పాటు పెండింగ్ ఫైల్ పై సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టని పక్షంలో 224 నూతన పంచాయతీలను వదిలేసి పాత గ్రామ పంచాయతీలు అయిన 12,769 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. అయితే 2024 ఎన్నికల సంవత్సరంగా మారబోతోంది. జనవరి మొదలుకుని వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మండల పరిషత్తు ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించనున్నారు. అలాగే ఖాళీ అయిన శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల ఎన్నికలు జరుగనున్నాయి.
రిపోర్టింగ్ : కాపర్తి నరేంద్ర, ఖమ్మం