CPI Narayana Letter : మీ అబ్బాయి వల్ల మీ తీరు మారింది, పార్టీకి చెడ్డ పేరు తేకండి- పువ్వాడకు సీపీఐ నారాయణ లేఖ!
02 December 2023, 19:22 IST
- CPI Narayana Letter : సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపిస్తూ రాసిన లేఖ సంచలనంగా మారింది. సీపీఐ అభ్యర్థికి కనీసం మద్దతు ఇవ్వకపోవడం దారుణం అన్నారు.
సీపీఐ నారాయణ
CPI Narayana Letter : "మీరు నాటిన చెట్టును మీరే నరికేస్తున్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను కించపరచకండి. పార్టీ ఆఫీస్ ముందు ఉన్న మీ ఫ్లెక్సీని మీరే తొలగించండి"...ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు... పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాసిన లేఖ సంచలనంగా మారింది.
సీపీఐ నారాయణ లేఖ
"కొత్తగూడెంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉంటే కనీస మద్దతు ఇవ్వకపోవడం దారుణం..పైగా సీపీఐ రాజకీయ విధానానికి విరుద్ధంగా మీ కుమారుడు అజయ్ కి మద్దతు ఇవ్వడంపై మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉంది. మీ గత చరిత్ర దృష్ట్యా రాయలేకపోయాను. మీ చర్యలను గమనించి ఇక భరించలేక ఈ ఉత్తరం రాస్తున్నాను" అంటూ ఆ లేఖలో అనేక విషయాలు ప్రస్తావించడం గమనార్హం. "తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. మీ కుమారుడు రాజకీయాల్లోకి ప్రవేశించింది మొదలు మీలో సైతం మార్పులు వచ్చాయి. తండ్రి, కొడుకులు ఒకే పార్టీలో ఉండాలని ఏం లేదు. కేరళలో మన పార్టీలో ఉన్న గౌరీ, గౌరీ థామస్ చెరొక పార్టీలో ఉన్నారు. నీలం రాజశేఖర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి సొంత అన్నదమ్ములు అయినా వేరు వేరు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మీకు తెలియంది కాదు. మీరు సీపీఐలో ప్రముఖపాత్ర పోషించారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. ఖమ్మం జిల్లాలో పార్టీని ఉన్నత స్థానంలో నిలిపారు. మీ సేవను పార్టీ గానీ, ప్రజలు గానీ మర్చిపోలేరు. ప్రస్తుతం ఆరోగ్య రీత్యా క్రియాశీలకంగా వ్యవహరించకపోయినా మిమ్మల్ని సాధారణ సభ్యులుగా పార్టీ చూడలేదు. మీరు ఎక్కడ సభలకు వచ్చినా పార్టీ మీకు గొప్ప స్థాయిలో గౌరవం ఇస్తోంది. చివరికి ఖమ్మం జిల్లా కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది" అని నారాయణ లేఖలో పేర్కొన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా
"ఇంత గౌరవం పొందుతున్న మీరు పార్టీకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక పార్టీలు మారుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రతి సందర్భంలో మీ అబ్బాయిని మీరు సమర్థిస్తున్నారు తప్ప పార్టీ తీసుకున్న నిర్ణయాలను సమర్దించడంలేదు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సీపీఐ ఒకే విధానాన్ని తీసుకుంది. అందుకు అనుగుణంగా మీరు వ్యవహరించడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి పోటీ చేశారు. ఆయనకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా మీ నుంచి రాలేదు. పైగా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ కుమారుడిని సమర్థిస్తున్నారు. అందువల్ల ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ ముందు పెట్టిన మీ ఫ్లెక్సీని మీరే తొలగించే ఏర్పాటు చేయండి" అంటూ నారాయణ ఘాటుగా రాసిన లేఖ ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.