తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Ktr : ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్, ఆ పేరులోనే పవర్ ఉంది- మంత్రి కేటీఆర్

Minister KTR : ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్, ఆ పేరులోనే పవర్ ఉంది- మంత్రి కేటీఆర్

30 September 2023, 15:57 IST

google News
    • Minister KTR : తారక రామారావు అనే పేరులోనే పవర్ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ పార్కు, విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. చరిత్రలో ఎన్టీఆర్ స్థానం పదిలం అన్నారు.
మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

Minister KTR : దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు, ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ కొట్టలేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ కు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అని గుర్తుచేసుకున్నారు. రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు మాకు రాముడైనా, కృష్ణుడైన ఎన్టీఆరే అన్నారు. చరిత్రలో మహనీయుల స్థానం అజరామనీయం అందులో ఎన్టీఆర్ స్థానం పదిలం అన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నాకు తారక రామారావు అనే పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం వీడీవోస్ కాలనీలో రూ.8.54 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కాల్వొడ్డు వద్ద రూ.690.52 కోట్లతో మున్నేరు ఆర్సీసీ రక్షణ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మున్నేరు వద్ద రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గట్టయ్య సెంటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎల్ఆర్ఎస్ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన TUFIDC నిధులు రూ.100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.

ఆ పేరులోనే పవర్

ఖ‌మ్మంలోని ల‌కారం ట్యాంక్‌ బండ్‌పై రూ. 1.37 కోట్లతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ స‌హా విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ ఎన్టీఆర్ ఎంతో ఆప్తుడని అన్నారు. ఎవ‌రు ఎన్ని ర‌కాల చ‌రిత్రలు రాసినా....చెరిగిపోని స‌త్యాలతో తెలుగు వారి గొప్పతనాన్ని ఎలుగెత్తి, చాటి చెప్పింది ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ రెండో ఆలోచ‌న ఉండదన్నారు. ఎన్టీఆర్ తెలగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. భార‌త‌దేశంలో తెలుగు వారంటూ ఉన్నార‌ని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ చ‌రిత్రలో చిర‌స్మర‌ణీయంగా గుర్తుండి పోతారన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవ‌కాశం రావ‌డం త‌న అదృష్టమని కేటీఆర్ అన్నారు. త‌న‌కు తార‌క రామారావు పేరు ఉండ‌టం చాలా సంతోషంగా భావిస్తున్నానన్నారు. తార‌క రామారావు పేరులోనే ప‌వ‌ర్ ఉంద‌ని తెలిపారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పారన్నారు.

తదుపరి వ్యాసం