Khammam Fort : వెయ్యేళ్ల ఖమ్మం ఖిల్లా-గత చరిత్ర సజీవసాక్ష్యం
23 October 2023, 16:19 IST
- Khammam Fort : వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లా... ఎన్నో సజీవ సాక్ష్యాలకు ఆధారంగా నిలుస్తోంది. కాకతీయుల రెండో రాజధానిగా వెలుగొందింది.
ఖమ్మం ఖిల్లా
Khammam Fort : రాచరిక వైభవానికి ప్రతీక ఖమ్మం ఖిల్లా. ఇందుకు సాక్షాలుగా ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ కోటపై కనిపించే శాసనాలు, రాతి కట్టడాలు, బురుజులు, ఫిరంగులతో పాటు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీరుండే కోనేరు వంటివన్నీ వాటి సుదీర్ఘ చారిత్రక రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యాలే. క్రీ. శ.950లో వెలుగుమట్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, వేమారెడ్డి అనే రైతులు తమ వ్యవసాయ భూములను సేద్యం చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమితమైన నిధులు, నిక్షేపాలు పొలంలో లభించాయి. కాగా ఈ విషయం ఆనోటా ఈనోటా పడి కాకతీయ రాజు చెవిన పడింది. దీంతో ఆయన ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలోనే ఖిల్లా నిర్మాణాన్ని చేపట్టారని చరిత్ర చెబుతోంది. మొదట ఖమ్మం ఖిల్లా మట్టి కోటగానే ఉండేదట. ఆ తర్వాత సుధీర్ఘ కాలంపాటు శ్రమించి ఖిల్లాను నిర్మించారు.
సుమారు క్రీ.శ 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి అనే వ్యక్తులు కోట నిర్మాణాన్ని పట్టుదలతో కొనసాగించారు. క్రీ.శ. 1006లో ఈ నిర్మాణం పూర్తయింది. దీన్ని బట్టి ఇప్పుడు ఖిల్లా వయసు 1017 సంవత్సరాలుగా స్పష్టమవుతోంది. ఖమ్మం 300 ఏళ్లపాటు రెడ్డి వంశీయుల పాలనలో ఉంది. తర్వాత ఈ ప్రాంతాన్ని వెలమరాజులు చేజిక్కించుకున్నారు. అనంతరం నందవాణి, కాళ్లూరు, గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్లిపోయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతి రాజు)లను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఇది ఆసఫ్ జాహీల ఆధీనంలోకి పోయింది.
కాకతీయుల ఏలుబడిలో ఉన్న ప్రదేశం కావడంతో పాటు అప్పటికే శత్రు సైన్యాలు అనేక దఫాలుగా దాడులు చేయడంతో వాటిని ఎదుర్కొనేందుకు కాకతీయ రాజు తనకు దొరికిన నిధి, నిక్షేపాలతో ఈ ఖిల్లా నిర్మాణాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు పూనుకున్నట్లు చరిత్ర చెబుతోంది. దీంతో పాటు వరంగల్ నుంచి రాజు ఆదేశాల మేరకు ఖమ్మం వచ్చి ఖిల్లా దుర్గాన్ని, దాని పక్కన చెరువును నిర్మించారని.. అందుకే లక్ష్మారెడ్డి పేరుతో "లకారం చెరువు" నిర్మితమైందని మరో కథనం. అలా ఖిల్లా నిర్మాణం పూర్తయిన తర్వాత రెడ్డి రాజులు, వెలమరాజులు ఈ కోటను మరింతగా మెరుగుపరిచారు.
పది ద్వారాల దుర్గం
ఖిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్లు. కోటను ఒక ఎత్తైన రాతి కొండపై నిర్మించారు. దీనికి మొత్తం 10 బురుజులు నిర్మించారు. శత్రుసైన్యం దాడులను తట్టుకునేలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా రెండేసి చొప్పున గోడలను నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లను కోట నిర్మాణం కోసం ఉపయోగించారు. వాటిని నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మాణం చేపట్టారు. విచిత్రమేమిటంటే రాళ్లు ఒకదానికి ఒకటి అంటుకుని ఉండేందుకు ఎలాంటి సున్నం వాడకపోవడం. వాటి చుట్టూ లోతైన కందకాన్ని తీశారు. దీనికి ఉన్న ప్రహరీ గోడ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు. కోట ప్రహరీ లోపలకు వెళ్లడానికి మొత్తం 10 ద్వారాలను ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
పశ్చిమం వైపున దిగువ కోటకు ప్రధాన ద్వారంగా ఉంది. తూర్పు వైపు ద్వారాన్ని 'రాతి దర్వాజ' లేక 'పోత దర్వాజ' అని పిలుస్తారు. అయితే ఖిల్లాలోకి ప్రవేశించడానికి మాత్రం రెండు ముఖ ద్వారాలు ఉన్నాయి. లోపలి సింహద్వారం చతురస్రాకారంలో ఉండి 30 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద రాళ్లతో నిర్మితమై ఉంది. సింహ ద్వారం సమీపంలో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. ఈ రాతికట్టడానికి ఫిరంగి గుండు తగిలినా చెక్కుచెదరనంత పటుత్వంగా ఉంటుంది. అలాగే కోట గోడలపై ఉన్న చిన్న చిన్న గోడలను జాఫర్ దౌలా (ధంసా) నిర్మించారు. ఈ నిర్మాణాన్ని ఇటుకలు, సున్నంతో చేపట్టారు.
కాకతీయులకు రెండో రాజధాని
మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం ఖిల్లా అనంతరం స్వాతంత్య్ర మండలి రాజ్యాంగా రూపొందింది. కాకతీయుల సామ్రాజ్యం నశించిన తర్వాత తెలుగు నేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంత రాజులు ఏకమయ్యారు. ఖమ్మం సమీపంలో ఉన్న మూసురూలి నాయకత్వంలో పదేళ్లపాటు వీరోచితంగా పోరాటం జరిపారు. ఆ తర్వాత సీతాపతి కాలంలో ఖమ్మం ఖిల్లాయే తెలంగాణకు ముఖ్య కేంద్రంగా ఉండేది. సీతాపతి.. బహ్మనీ సుల్తాన్ల సహాయంతో వరంగల్ కు రాజప్రతినిధిగా ఎన్నికయ్యారు. పెద్దయ్యామాత్యుని సహాయంతో తెలంగాణలో తిరిగి తెలుగు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మాన్ని తన సామ్రాజ్యానికి రెండో రాజధానిగా ఆయన ప్రకటించారు.
ఈ సమయంలో కులీకుతుబ్ షా.. సీతాపతిని ఓడించి ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకున్నాడు. అతని అధీనంలో ఉన్న ధనరాసులను గోల్కొండకు తరలించారు. క్రీ.శ.1615లో శ్రీకృష్ణదేవరాయలు.. కులీకుతుబ్ షాను ఓడించి ఖమ్మం దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆంధ్రభోజుడైన ఆయన తన దిగ్విజయ యాత్రలో భాగంగానే దీన్ని జయించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. "గంభము మెట్టు గ్రక్కున గదల్చి.. రాజపుత్రుడే శ్రీకృష్ణాదేవరాయ విభుడు" అంటూ ముక్కు తిమ్మన తన 'పారిజాతాపహరణం' ప్రబంధంలో వర్ణించడం గమనార్హం. ఆ తర్వాత గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ ముల్కీ ఈ రాజ్యాన్ని ఆక్రమించారు.
1687 వరకు ఐదుగురు నవాబులు ఖమ్మం గిరిని పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వారిలో ఆఖరివాడు అబ్దుల్ హసన్ కుతుబ్ షా. 1658–1687 వరకు పాలించాడు. ఈయనను తానీషా అని పిలుస్తారు. 1687 ప్రాంతంలో గోల్కొండపై దండెత్తిన ఔరంగజేబు ఈ దుర్గాన్ని వశపరుచుకున్నాడు. 1761 నుంచి 1803 వరకు జాఫర్ దౌల్ అనే తహశీల్దారు పర్యవేక్షణలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. ఇతని కాలంలో ఈ కోట మరింతగా మెరుగులు దిద్దుకుంది. 1768లో రెండో జాఫరుద్దౌల తహశీల్దారుగా నియమితులయ్యారు. ఈయన అన్న పేరుతోనే ధంసలాపురం గ్రామం స్థాపితమైంది. ఎట్టకేలకు 1937లో నిజాం ప్రభుత్వం ఈ ఖిల్లాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాపై పురావస్తు శాఖ దృష్టి సారించి ఇంకా ఆధునికీకరించి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.