Khairatabad Ganesh Shoba Yatra : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం - రేపు ఉదయం 6 గంటలకే శోభాయత్ర ప్రారంభం
27 September 2023, 14:10 IST
- Khairatabad Ganesh Shoba Yatra 2023:రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు.
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర 2023
Khairatabad Ganesh Shoba Yatra 2023: వినాయక చవితి వేడుకలు ముగియనున్నాయి. ఇవాళ్టితో నవరాత్రులు పూర్తి కానున్న నేపథ్యంలో... బుధవారం నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. గురువారం ఉదయం ఆరు గంటలకే ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీగా భక్తుల రాక....
గురువారం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో... ఇవాళ భారీగా భక్తులు తరలివస్తున్నారు. లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమం కోసం 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు.
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో విగ్రహాలను తరలించే మార్గాలను నగర సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఎంజే మార్కెట్‌కు సమీపంలోని కన్వర్జెన్స్ పాయింట్ వద్ద సమష్టిగా పని చేయాలని సీవీ ఆనంద్ జోనల్ డీసీపీలను ఆదేశించారు. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ మార్గంలో చాంద్రాయణగుట్ట, చార్మినార్, నయాపూల్, ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, పీపుల్స్ ప్లాజా వరకు పోలీసుల తనిఖీలు సాగాయి. క్లిష్టమైన జంక్షన్లలో ఊరేగింపు కదలికలను పర్యవేక్షించాలని సూచించారు. చార్మినార్ మరియు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ప్రాథమిక ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సందర్భంగా, విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలకు వాటి ఎత్తుకు తగినట్టుగా స్పష్టమైన సూచనల్ని పాటించేలా చూడాలని ఆదేశించారు. విగ్రహాల ఎత్తు పరిమితులను ధృవీకరించడం, తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను గుర్తించి అడ్డంకులను పరిష్కరించడం మరియు ఊరేగింపుకు ఆటంకం కలిగించే అడ్డంకులను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.
నిమజ్జనం సందర్భంగా నగరంలో 25,694 మంది సిబ్బందితో పాటు 125 ప్లాటూన్‌లను మోహరించారని చెప్పారు. MJ మార్కెట్, అఫ్జల్‌గంజ్, అంబేద్కర్ విగ్రహం మరియు ఎన్టీఆర్ మార్గ్ వంటి 18 ముఖ్యమైన జంక్షన్‌లలో అధికారులతో సహా అందరికీ షిఫ్ట్ డ్యూటీల విధానాన్ని ప్లాన్ చేశారు. మూడు RAF కంపెనీలు మరియు ఇతర పారామిలిటరీ దళాలు ఇప్పటికే చేరుకున్నాయి.ఐదు డ్రోన్ బృందాలను రంగంలోకి దింపనున్నారు.
గణేష్ నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాలు మరియు నిమజ్జనం చేసే ప్రదేశాల్లోనూ సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. ఊరేగింపులో భాగమైన మార్గాలలో సాధారణ ట్రాఫిక్ అనుమతించరని, అయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు జరుగుతాయని ఆనంద్ తెలిపారు.