మార్చి 8న వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. 'మన ఊరు - మన బడి' కి శ్రీకారం!
28 February 2022, 22:07 IST
- ఒకవైపు జాతీయ స్థాయిలో వివిధ నాయకులను కలుస్తూ కొత్త రాజకీయ కూటమికి మద్ధతు కూడగడుతూనే, మరోవైపు రాష్ట్రంలో జిల్లాల పర్యటన చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రతిరోజూ వరుస షెడ్యూల్‌లతో కేసీఆర్ తీరిక లేకుండా గడుపుతున్నారు.
KCR
Hyderabad | ప్రతిరోజూ వరుస షెడ్యూల్‌లతో తెలంగాణ సీఎం కేసీఆర్ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో వివిధ నాయకులను కలుస్తూ కొత్త రాజకీయ కూటమికి మద్ధతు కూడగడుతూనే, మరోవైపు రాష్ట్రంలో జిల్లాల పర్యటన చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల పర్యటన ప్రారంభించి పలు జిల్లాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం, మార్చి 8వ తేదీన వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే కన్నెతండా లిఫ్టును సీఎం ప్రారంభిస్తారు. దీని తర్వాత వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. చివరగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఏమాత్రం గ్యాప్ లేకుండా కేసీఆర్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు కేసీఆర్.
రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి మంత్రి కేటీఆర్ సమీక్ష
రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికై అవసరమైన భవిష్యత్తు ప్రణాళికను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇప్పటికే తెలంగాణ టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తుందన్న మంత్రి, ఈ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపైన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలన్నారు. గత ఏడున్నర సంవత్సరాలుగా నేతన్నల సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం అనేక వినూత్నమైన కార్యక్రమాలను తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలైన యంగ్ వన్, దేశీయ టెక్స్‌టైల్ దిగ్గజమైన కిటెక్స్ వంటి అనేక కంపెనీలు తెలంగాణలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవ వనరులను, ప్రభుత్వ పాలసీలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.
రాష్ట్ర టెక్స్‌టైల్ శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు బడ్జెట్లో పొందుపర్చాల్సిన కార్యక్రమాలు, పథకాలు, ఇతర అంశాల పైన మంత్రి కేటీఆర్ టెక్స్‌టైల్ శాఖ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు.