తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr On Brs : బీఆర్​ఎస్ మొదటి కార్యక్షేత్రం చెప్పేసిన కేసీఆర్

KCR On BRS : బీఆర్​ఎస్ మొదటి కార్యక్షేత్రం చెప్పేసిన కేసీఆర్

HT Telugu Desk HT Telugu

05 October 2022, 19:42 IST

google News
    • KCR On National Politics : 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఆట.. టీఆర్ఎస్ కు టాస్క్ అని వ్యాఖ్యానించారు.
జాతీయ పార్టీపై కేసీఆర్
జాతీయ పార్టీపై కేసీఆర్

జాతీయ పార్టీపై కేసీఆర్

తెలంగాణ(Telangana) కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేద్దామని సీఎం కేసీఆర్(CM KCR) పిలుపునిచ్చారు. జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆషామాషీ నిర్ణయం కాదన్నారు. బలమైన పునాదుల పైనుంచే జాతీయ పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. కుల, లింగ వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు, దళితులు అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేకపోతున్నారని చెప్పారు.

'దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం దళితబంధు(Daltiha Bandhu). భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేశాం. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా జాతీయ పార్టీ జెండాతో వెళ్తున్నాం. అఖిలేశ్, తేజస్వి యాదవ్ కూడా వస్తామని చెప్పారు. నేనే వద్దని చెప్పా. దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ(Telangana) ఉద్యమానికి మాజీ ప్రధాని దేవెగౌడ గట్టి మద్దతునిచ్చారు. జేడీఎస్ సంపూర్ణ మద్దతుంటుందని దేవెగౌడ స్పష్టం అన్నారు.' అని కేసీఆర్ అన్నారు.

జాతీయపార్టీ(National Party)లో ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు జరిపామని కేసీఆర్ వెల్లడించారు. బీఆర్​ఎస్ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర అని కేసీఆర్ తెలిపారు. బీఆర్​ఎస్ అనుబంధ రైతు సంఘటన మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామన్నారు. దళిత, రైతు, గిరిజన ఉద్యమం ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

అంతకుముందు టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వివరించారు.

ఈ తీర్మానాన్ని సమావేశం ముందు పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

అంతకు ముందు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​ నుంచి తెలంగాణ భవన్​కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కేసీఆర్​కు ఘన స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరంపై కేసీఆర్ మాట్లాడారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ సహా సభ్యులందరూ ప్రగతిభవన్ వెళ్లి భోజనం చేశారు.

తదుపరి వ్యాసం